ఖైరతాబాద్ లడ్డూ లాగించారు!

Thursday, September 11th, 2014, 06:44:31 PM IST


స్థలం: ఖైరతాబాద్ వినాయకుడు కొలువుదీరిన స్థలం
ఉదయం 6 గంటల నుంచి అక్కడ సందడి మొదలైంది. భారీ గణేషుడి చేతిలో 11 రోజులు పూజలందుకున్న ప్రసాదం కోసం భక్తులు బారులు తీరారు. ప్రసాదాన్ని భక్తులకు పంచేందుకు పోలీసులు,కమిటీ సభ్యులు బారీ కేడ్లు సైతం కట్టారు. అన్నింటికి మించి 11 గంటల 45 నిమిషాలకు ప్రసాదం పంచాలని ఆలోచించిన కమిటీ సభ్యులు.. భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకొని 10 గంటల ముప్పై నిమిషాలకే ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.

అయితే లైన్లో ఉన్న భక్తులకు అందకుండా.. లడ్డూనూ పంపిణీ భద్రత కోసం వచ్చిన పోలీసులు లడ్డూనూ లాగించేశారు. భక్తులపై లాఠీలు జులిపిస్తూ అందిన కాడికి దోచుకెళ్లారు. పోలీసులు లడ్డూను అందినంత వరకు దోచుకున్నారు. పోలీసు టోపీలు, డ్రెస్స్ లు లడ్డూను దాచుకునేందుకు ఎంచక్కా ఉపయోగించుకున్నారు. ఇక టాస్క్ ఫోర్స్ డ్రెస్స్ లో ఉన్న ఓ పోలీసు ఆఫీసర్.. ఐడీ కార్డు చూపిస్తూ ఏం చేసుకుంటారో చేసుకోండీ అంటూ దొరికిన కాడికి తీసుకెళ్లాడు. హోం గార్డ్స్, కానిస్టేబుల్స్, ఆకరకు ఆఫీసర్ లెవెల్ అధికారులు సైతం చిన్న చిన్న కవర్లలో మొదలుకొని, పెద్ద పెద్ద సంచీల వరకు లాగించారు. ఇంకేముంది.. చూస్తుండగానే లడ్డూ ఖతం అయ్యింది. అయితే ఇంతా జరుగుతున్నా… పర్యవేక్షణలో ఉన్నా సీఐ అశోక్ గారు మాత్రం.. ఇవేమి పట్టనట్లు భక్తులపైనే లాఠీలు జులిపించమంటూ ఓవరాక్షన్ చేశారు..

కనీసం 50 వేల మందికి ప్రసాదాన్ని పంచుతామని చెప్పిన కమిటీ సభ్యులు.. 10 వేల మందికి కూడా లడ్డూను పంచలేకపోయారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ భద్రత కోసం పోలీసులను పెడితే… వారే దోచుకెళ్లారు. మహా ప్రసాదం లడ్డూ కోసం నమ్మకం తో వచ్చిన భక్తులకు లాఠీ దెబ్బలు, తోపులాటల రుచి చూపించారు. మన పోలీసులా.. మజాకా..?!