యాసిడ్ ఎటాక్స్ బాధిత‌ ఆడ‌పిల్ల‌ల‌కు కింగ్‌ఖాన్ భ‌రోసా?

Tuesday, January 23rd, 2018, 03:43:16 PM IST

ప్రేమ‌వ్య‌వ‌హారాల్లో యాసిడ్ ఎటాక్స్ ఎపిసోడ్స్ గురించి తెలిసిందే. నిరంత‌రం ఏదో ఒక మూల ఇలాంటి ఎటాక్‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. ఎంద‌రో అమాయ‌క అభాగ్య ఆడ‌పిల్ల‌లు బ‌లైపోతూనే ఉన్నారు. ఇలాంటివారిని ఆదుకునేందుకు ప్ర‌త్యేకించి ఏవైనా సామాజిక సేవా సంస్థ‌లు ఉన్నాయా? అంటే ఉన్నాయో లేవో బ‌య‌టి ప్ర‌పంచానికి తెలిసింది త‌క్కువే. కానీ అలాంటివారికి ఆప‌న్న హ‌స్తం అందించేందుకు కింగ్ ఖాన్ షారూక్‌ఖాన్ ఓ ఆర్గ‌నైజేష‌న్ స్థాపించార‌ని, త‌ద్వారా సేవ‌లందిస్తున్నార‌ని తెలిసింది త‌క్కువే. అందునా తెలుగు రాష్ట్రాల వ‌ర‌కూ ఈ విష‌యం పాకింది కూడా త‌క్కువే. పేద‌రికంలో ఉన్న ఆడ‌పిల్ల‌ల‌కు అనూహ్య స‌న్నివేశంలో ఈ సంస్థ సాయం చాలా అవ‌స‌రం కూడా.

కింగ్ ఖాన్ షారూక్ ప్రారంభించిన ఈ సంస్థ‌… కేవ‌లం యాసిడ్ బాధితుల‌కే కాదు.. క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న చిన్నారుల‌ను కాపాడేందుకు, వ్య‌స‌నానినికి బానిసైన వారికి పున‌రావాసం క‌ల్పించేందుకు సాయం చేస్తోందిట‌. `మీర్ ఫౌండేష‌న్‌` (ఎంఈఈఆర్ ఫౌండేష‌న్‌) పేరుతో షారూక్ ఈ నాన్ ప్రాఫిట‌బుల్ (లాభం ఆశించ‌ని) సేవా సంస్థను ర‌న్ చేస్తున్నారు. వేల కోట్ల సామ్రాజ్యాన్ని విస్త‌రించిన షారూక్ ఇలాంటి ఓ ఘ‌న‌త వ‌హించిన సంస్థను ర‌న్ చేస్తున్నారు కాబ‌ట్టే అత‌డిని ప్ర‌పంచం గుర్తించింది. త‌న‌దైన ఛ‌రిష్మాతో ద‌శాబ్ధాలుగా బాలీవుడ్‌కి ఎంతో సేవ చేశారు. ఇప్పుడు సామాజిక కార్య‌క‌లాపాల్లోనూ ఖాన్ ఎంతో మేలు చేస్తున్నారు. అది గుర్తించిన వ‌ర‌ల్డ్ ఎక‌నమిక్ ఫోరం అత‌డిని అంత‌ర్జాతీయ పుర‌స్కారం అందించి స‌త్క‌రించింది. వ‌ర‌ల్డ్ ఎక‌న‌మిక్ ఫోరమ్‌ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న 48వ వార్షిక స‌మావేశం సంద‌ర్భంగా దావోస్‌లో షారూక్‌ని స‌న్మానించి 24వ వార్షిక క్రిస్ట‌ల్ అవార్డును అందించింది. ఇక‌పోతే .. షారూక్ ర‌న్ చేస్తున్న ఈ సంస్థ సాయం పొందాలంటే సామాజిక మాధ్య‌మాల్ని విరివిగా అనుస‌రిస్తే రిజ‌ల్ట్ వేగంగానే ఉండే అవ‌కాశం ఉంది.