ఆటలో అరటిపండు.. బాలకృష్ణపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..!

Saturday, March 6th, 2021, 04:06:40 PM IST

హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కొడాలి నాని బాలకృష్ణ సినిమా షూటింగుల కోసం ఇతర దేశాలు, రాష్ట్రాల్లో తిరుగుతారని కానీ మన రాష్ట్రంలోని పరిస్థితులు ఆయనకు తెలియవని అన్నారు. తన తండ్రికి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదవడం తప్ప బాలయ్య ఏమీ చేయలేడని, ఆయన ఆటలో అరటి పండులాంటి వాడంటూ ఎద్దేవా చేశారు.

ఇక టీడీపీ అధినేత చంద్రబాబు శనిగ్రహం అని, ఈ విషయం స్వర్గీయ ఎన్‌టీఆర్ ఎప్పుడో చెప్పారని కొడాలి అన్నారు. శని వదలాలంటే చంద్రబాబుకు పూజలు చేయాలని, వాళ్ల పార్టీ నేతలు తమ శని వదిలించుకోవడానికి చంద్రబాబు చుట్టు తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. మంత్రి పెద్దిరెడ్డి దెబ్బకు చంద్రబాబు చిన్న మెదడు చితికిపోయిందని, ఆయనకు మైండ్ చెడిపోయిన విషయం అందరికీ తెలుసని కొడాలి నాని అన్నారు.