బీజేపీలో ఈటల చేరికపై టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ అసంతృప్తి..!

Saturday, June 5th, 2021, 05:15:28 PM IST

మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వచ్చే వారంలో ఈటల బీజేపీలో చేరేందుకు సిద్దమవుతున్నారు. ఈ క్రమంలో బీజేపీలో ఈటల చేరికపై టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈటల తీసుకున్న నిర్ణయం సరికాదని, మంచి అవకాశాన్ని ఆయన చేజార్చుకున్నారని కోదండరామ్ అన్నారు. ప్రజాస్వామ్యం కోసం పోరాడే శక్తిగా ఈటల మారతారని ప్రజలు భావించారని, తెలంగాణ సమాజం మొత్తం ఈటల వైపు చూసిందని చెప్పుకొచ్చారు.

అయితే కేసీఆర్ సర్కార్‌పై పోరాడాలనుకున్న వారంతా ఈటల నిర్ణయంతో చల్లబడిపోయారని అన్నారు. కేసీఆర్ మీద పోరాటం చేస్తే తాను, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా కలసివస్తామని ఈటలకు చెప్పామని అన్నారు. ఈటల చేరిక వలన బీజేపీకే లాభం కానీ ఆయనకొచ్చేదేమీ లేదని కోదండరామ్ వ్యాఖ్యానించారు. బీజేపీలో చేరాలన్న ఈటల నిర్ణయం ఆయన వ్యక్తిగతమని, బీజేపీలో చేరవద్దని ఈటలకు తాను ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. ఈటల తీసుకునే నిర్ణయం అందర్నీ కలుపుకుపోయేలా ఉంటోందని భావించామని కానీ అదీ జరగలేదని అన్నారు.