ఎన్నికలపై ఉన్న శ్రద్ధ కరోనా కట్టడిపై లేదు.. టీఆర్ఎస్ సర్కార్‌పై కోదండరాం ఫైర్..!

Thursday, April 29th, 2021, 08:00:29 PM IST

తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయని, కరోనాను కట్టడి చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని జేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. తెలంగాణ జనసమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో జెండాను ఎగరవేసిన కోదండరాం అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికలపై ఉన్న శ్రద్ధ కరోనా కట్టడిపై లేదని విమర్శలు గుప్పించారు. హైకోర్టు ప్రశ్నించడం వలనే ప్రభుత్వం రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధించి చేతులు దులుపుకుందని అన్నారు.

అయితే కరోనాపై ప్రభుత్వం వాస్తవాలు దాచిపెడుతోందని, కేసులు, మరణాల విషయంలో పారదర్శకత లోపించిందని అన్నారు. ప్రభుత్వం చేతులెత్తేయటంతో చాలా చోట్ల ప్రజలే స్వచ్చందంగా కరోనా కట్టడికి లాక్‌డౌన్ విధించుకుంటున్నారని అన్నారు. ఆక్సిజన్, మందులు అందుబాటులో ఉంచి, బ్లాక్ మార్కెట్‌కు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోదండరాం డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి కరోనా నియంత్రణకు చర్యలు చేపట్టాలని, కరోనా బారిన పడిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోదండరాం సూచించారు.