వాళ్ళను వదిలేవరకు దీక్ష చేస్తానంటున్న కోదండరాం

Thursday, December 29th, 2016, 02:55:03 PM IST

kodandaram
తెలంగాణ ప్రభుత్వ పని తీరుకు వ్యతిరేకంగా టీజేఏసీ చైర్మన్, ప్రొఫసర్ కోదండరాం ఆయన స్వగృహంలోనే దీక్షకు దిగారు. సాగునీటి ప్రాజెక్టులకు భూసేకరణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు నిరసనగా తలపెట్టిన ఆందోళనకు ప్రభుత్వం అనుమతి నిరాకరించిందని, ఈ విషయం తమకు తెలియగానే ఆందోళనను విరమించుకున్నామని, అయినా తమ ఆందోళనకు మద్దతిచ్చిన రైతులను ప్రభుత్వం అరెస్ట్ చేయించిందని కోదండరాం అన్నారు.

రైతులకు అన్యాయం జరుగుతుంటే తాము చూస్తూ ఊరుకోమని, 2013 భూసేకరణ చట్టం భూనిర్వాసితులకు హక్కులు కల్పిస్తే.. తెలంగాణ ప్రభుత్వం చేసిన చట్టం మాత్రం ఏకపక్షంగా ఉందని ఆయన విమర్శించారు. అరెస్ట్ చేసిన రైతులందరినీ విడుదల చేసేవరకు తాను దీక్ష విరమించేది లేదని ఆయన స్పష్టం చేశారు. భూసేకరణ చట్టంలో మార్పులు చేసి భూమిని కోల్పోయిన రైతులందరికీ న్యాయం చేయాలనీ కోదండరాం డిమాండ్ చేశారు. కోదండరాం చేస్తున్న ఈ దీక్షకు కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా పలువురు నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులూ మాట్లాడుతూ.. కోదండరాం లాంటి వారికే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతుంటే ఇంక ఈ రాష్ట్రంలో సాధారణ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు అని అన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments