నిరుద్యోగుల త‌ర‌పున కోదండ‌ మ‌రో ఉద్య‌మం..

Wednesday, February 15th, 2017, 12:12:38 AM IST


బీఎడ్ చేసి… డీఎస్సీ కోసం వేచి చూసి..చూసి.. టెట్ కోసం కోచింగ్ లకు వేల రూపాయిలు ఖర్చు పెట్టి… ఇంటికి వెళ్లలేక… హైదరాబాద్ లో ఖర్చులు భరించలేక నిరుద్యోగులు నానా తంటాలు ప‌డుతున్నారు. ఉద్యోగం కోసం అడిగితే … ర‌క‌ర‌కాల రూల్స్‌, గొడ‌వ‌ల పేరుతో రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ఆపేస్తున్నారు. మాకు ఉద్యోగాలు ఎప్ప‌టికి వస్తాయి సర్? అంటూ నిరుద్యోగుల్లో ఒక‌టే నిరాశ‌.

పరీక్షలన్నీ బహిష్కరించి ఉద్యమంలో పాల్గొన్నందుకా… ? వద్దురా కొడుకా అన్నా వినకుండా తెలంగాణ నినాదాలు చేస్తూ లాఠీ దెబ్బలు తిన్నందుకా…? `కారు`కే జై కొట్టి మిమ్నల్నే సీఎం సీటులో కూర్చొబెట్టినందుకా…? ఎందుకీ నిరుద్యోగం?…అంటూ తెలంగాణ‌లోని నిరుద్యోగులంతా ఒక‌టే విన్న‌వించుకుంటున్నారు. ఇటు టీచ‌ర్ ఉద్యోగార్థుల‌తో పాటు, అటు గ్రూప్స్ ప‌రీక్ష‌లు రాస్తున్న‌వాళ్ల‌కు ఇక్క‌డ రిక్రూట్‌మెంట్ జ‌రిగే తీరుపై అసంతృప్తి నెలకొంది. అస‌లు తెలంగాణ‌లో ఉద్యోగాలు ఇస్తారా? అన్న సందేహం అలుముకుంటోంది. కేసీఆర్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుతెన్నుల‌పై తెలంగాణ నిరుద్యోగుల్లో విప‌రీత‌మైన అసంతృప్తి నెల‌కొని ఉంది. అయితే ఇదే అద‌నుగా ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్ లైన్‌లోకొచ్చారు. నిరుద్యోగుల్లో నెల‌కొన్న అసంతృప్తిని ఉద్య‌మ‌రూపంలోకి మ‌లిచేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈనెల 22న నిరుద్యోగుల ర్యాలీకి ఇప్ప‌టికే పిలుపునిచ్చారు. మారుతున్న ప‌రిణామాలు చూస్తుంటే ప్ర‌భుత్వంపై తీవ్ర అసంతృప్తి రాజుకుంటోంద‌న్న సంగ‌తి అర్థ‌మ‌వుతోంది. మ‌రి ఇప్ప‌టికైనా నిజాయితీగా కేసీఆర్ రిక్రూట్‌మెంట్ చేస్తారంటారా? ఉద్యోగాలిస్తారంటారా?