హుజూర్ న‌గ‌ర్ బ‌రిలో ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్‌!

Monday, June 3rd, 2019, 10:49:30 AM IST

తెలంగాణ‌లో ముంద‌స్తు స‌మ‌రం నుంచి మొద‌లైన ఎన్నిక‌ల గోల ఇంకా ముగియ‌డం లేదు. సార్వ‌త్రిక ఎన్నిక‌లు, స్థానిక ఎన్నిక‌లు, ఎమ్మెల్సీ ఎన్నిక‌లు.. స‌ర్పంచ్ ఎన్నిక‌లు ఇలా వ‌రుస పెట్టి ఎన్నిక‌ల మేళ జ‌రుగుతూనే వుంది. తాజాగా హుజూర్‌న‌గ‌ర్ నుంచి పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి ఇటీవ‌ల జ‌రిగిన పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో న‌ల్ల‌గొండ ఎంపీగా విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. దీంతో ఎమ్మెల్యేగా ఆయ‌న ఈ నెల 3న‌ రాజీనామా చేయ‌నుండంతో హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక జ‌ర‌గ‌బోతోంది. ఈ స్థానం నుంచి ఉత్త‌మ్ స‌తీమ‌ణి పోటీకి దిగుతార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఆమె పోటీకి సుముఖంగా లేర‌ని తేల‌డంతో ఎవ‌రు పోటీ చేస్తారా అనే ఉత్కంఠ మొద‌లైంది.

తాజాగా ఆ స్థానం నుంచి తెజ‌స అధినేత ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్‌ని అక్క‌డి నుంచి పోటీకి దింపుతున్నార‌ని తెలుస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో కోదండ‌రామ్ జ‌న‌గామ టికెట్‌ని ఆశించారు. కానీ పొన్నాల ల‌క్ష్మ‌య్య కోసం ఆ స్థానాన్ని కేటాయించి కోదండ‌రామ్‌కు కాంగ్రెస్ అధిష్టానం మొండిచేయి చూపించింది. దాంతో తెజ‌స శ్రేణులు కాంగ్రెస్ అధిష్టానంపై, పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డిపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశాయి. అయితే ఆ త‌ప్పును స‌రిదిద్దుకునే అవ‌కాశం హుజూర్ న‌గ‌ర్ రూపంలో ద‌క్క‌డంతో ఆ స్థానాన్ని కోదండ‌రామ్‌కు కేటాయించ‌బోతున్నార‌ని తెలుస్తోంది. ఇక్క‌డ గెలిచి కోదండ‌రామ్ అసెంబ్లీకి వ‌స్తే అసెంబ్లీలో ఇక రోజూ స‌మ‌ర‌మే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.