కోడెల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!

Monday, June 10th, 2019, 12:17:04 PM IST

ప్ర‌జ‌ల ఓట్ల‌తో అంద‌ల‌మెక్కిన నాయ‌కులు ప్ర‌జ‌ల‌ని పాలించ‌కుండా వారిపై స్వారీ చేస్తే ప‌ర్య‌వ‌సానం ఎలా వుంటుందో చెప్ప‌న‌క్క‌ర‌లేదు. ఇప్పుడు అదే ప‌రిస్ధితుల్ని టీడీపీ నేత కోడెల శివ‌ప్ర‌సాదరావు ఎదుర్కొంటున్నారు. అధికారంలో వుండ‌గా ఈ మాజీ స్పీక‌ర్ కుటుంబం చేసిన అక్ర‌మాలు, భూ ఆక్ర‌మ‌ణ‌లు అన్నీ ఇన్నీ కావ‌ని ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌ప‌డుతోంది. తండ్రి ప‌ద‌విని అడ్డంపెట్టుకుని ఆయ‌న కుమారుడు శివ‌రామ‌కృష్ణ‌, కుమార్తె విజ‌య‌ల‌క్ష్మి సాగించిన అరాజ‌కాల‌పై జ‌నం పోలీస్ స్టేష‌న్ మెట్లెక్కి క‌థ‌లు క‌థ‌లుగా చెబుతుండ‌టం సంచ‌ల‌నంగా మారింది. కోడెల కుటుంబ బాధితులు ప్ర‌స్తుతం న‌ర‌సారావుపేట పోలీస్టేష‌న్‌కు క్యూక‌డుతుండ‌టం సంచ‌ల‌నంగా మారింది.

న‌ర‌సారావుపేట శివారులో కోటిప‌ల్లి మ‌ల్లిఖార్జున ఓ బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాన్ని నిర్మిస్తున్నారు. దానిపై క‌న్నేసిన కోడెల త‌న‌యుడు త‌న వ‌ర్గాన్ని పంపించి అత‌ని ద‌గ్గ‌ర 14 ల‌క్ష‌లు రౌడీ మామూలు చెల్లించ‌మ‌ని వేధించ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. 25 ల‌క్ష‌లు డిమాండ్ చేసి చివ‌రికి 14 ల‌క్ష‌ల‌కు డీల్ ఓకే అన్నార‌ని, ఇలా ఎంతో మందిని బెదిరించార‌ని ఆరోపించారు. కోడెల కూతురు కూడా 18 మంది నిరుద్యోగుల వ‌ద్ద నుంచి ఒక్కొక్క‌రి చొప్పున 6 నుంచి 10 ల‌క్ష‌లు వ‌సూలు చేశార‌ని ఫిర్యాదులు అంద‌డంతో పోలీసులు బిత్త‌ర‌పోతున్నారు. వీరే కాక కోడెల కుటుంబం బారిన ప‌డి న‌ష్ట‌పోయిన వారు ఇంకా ఎంత మంది వున్నారా? అని ఆరాతీస్తున్నార‌ట‌.