మ‌లేషియా అదిరేలా కోలీవుడ్‌ స్టార్‌నైట్‌!!

Thursday, January 4th, 2018, 02:02:52 PM IST

న‌డిగ‌ర సంఘం సార‌థ్యంలో జ‌న‌వ‌రి 6న‌ మ‌లేషియా అదిరేలా ఓ భారీ ఈవెంట్ జ‌ర‌గ‌నుంది. ఈ ఈవెంట్‌కి ఏకంగా కోలీవుడ్ యావ‌త్తూ త‌ర‌ళివెళ్ల‌నుంద‌ని తెలుస్తోంది. దాదాపు 250 మంది ఆర్టిస్టులు ఒకేవేదిక‌పైకి రానున్న ఈ వేడుక‌లో సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, ఉల‌గ‌నాయ‌గ‌న్ క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌త్యేక అతిధులుగా అల‌రిస్తార‌ని తెలుస్తోంది. అయితే ఈ స్టార్ నైట్ వెన‌క ఉద్ధేశం మాత్రం వేరు. మ‌లేషియాలో ఉన్న త‌మిళుల నుంచి భారీగా విరాళాలు సేక‌రించి ఆర్టిస్టులకు సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌న్న‌ది ప్లాన్‌. అలానే త‌మిళ ఆర్టిస్టుల సంఘానికి సొంతంగా బిల్డింగ్ నిర్మించాల‌న్న ప్ర‌తిపాద‌న ఉంది. ర‌జ‌నీ, క‌మ‌ల్ హాస‌న్ వంటి పెద్ద స్టార్లు ఈ ఈవెంట్‌కి ఎటెండ్ అవుతున్నారంటే అందుకు త‌గ్గ‌ట్టే జ‌నాల ఫ్లోటింగ్ అదే తీరుగా ఉంటుంది. అలాగే కార్య‌క్ర‌మానికి భారీగా విరాళాలు వెల్లువెత్తేందుకు ఆస్కారం ఉంది.

ఇక కౌలాలంపూర్‌- బుకిత్ జ‌లీల్ నేష‌న‌ల్ స్టేడియంలో జ‌ర‌గ‌నున్న ఈ ఈవెంట్ కెపాసిటీ 8700 మందికి మాత్ర‌మే అయినా .. ల‌క్ష‌ల్లో ఎటెండ్ అయ్యే అవ‌కాశం ఉందిట‌. జ‌న‌వ‌రి 6 ఉద‌యం 11 గంట‌ల నుంచి స్కిట్‌లు, గేమ్ షోలు, క్రికెట్‌, ఫుట్‌బాల్ గేమ్స్ వ‌గైరా కార్య‌క్ర‌మాల్ని నిర్వ‌హిస్తున్నారు. అంతేకాదు ఈ వేడుక‌లో ర‌జ‌నీ-శంక‌ర్‌ల ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం 2.ఓ టీజ‌ర్‌ని లాంచ్ చేస్తారుట‌. విశాల్ పందెంకోడి 2 టీజ‌ర్ లాంచ్ చేసే అవ‌కాశం ఉంది. అలానే శివ‌కార్తికేయ‌న్ భ‌విష్య‌త్ ప్రాజెక్టుల‌పైనా ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంద‌ని తెలుస్తోంది.