కోలీవుడ్‌ని చూసి బుద్ధి నేర్వ‌రా?

Friday, April 13th, 2018, 11:19:18 PM IST


ఏం చేసినా తంబీలే చేయాలి. అక్క‌డ ఏదైనా అనుకుంటే చాలు అనుకున్న‌ది సాధించుకునేవ‌ర‌కూ వ‌దిలిపెట్ట‌రు. త‌మిళం మాత్ర‌మే ప్రాచీన భాష అని నిరూపించాల‌నుకున్నారు. నిరూపించి చూపించారు. జల్లికట్టుపై కేంద్రం మెడ వంచాల‌ని భావించారు. అన్నంత ప‌నీ చేశారు. ఇప్పుడు కావేరీ జ‌లాల వివాదం ప‌రిష్కారం విష‌యంలోనూ కేంద్రంపై పోరాడుతున్న తీరు సంచ‌ల‌న‌మైంది.

ఇక సినీప‌రిశ్ర‌మ వ‌ర‌కూ వ‌స్తే, ఇక్క‌డ ఎంతో కాలంగా నిలువు దోపిడీకి పాల్ప‌డుతున్న డిజిట‌ల్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ (డిఎస్‌పి) స‌మ‌స్య ప‌రిష్క‌రానికి ఏం చేయాలో పాలుపోని స‌న్నివేశంలో థియేట‌ర్ల బంద్‌ని ప్ర‌క‌టించారు. సౌత్ అంత‌టా ప్ర‌క‌టించినా చివ‌రికంటా పోరాడి అనుకున్న‌ది సాధించుకున్న‌ది కోలీవుడ్ మాత్ర‌మే. అక్క‌డ దోపిడీకి పాల్ప‌డుతున్న పాత డిఎస్‌పీలను త‌రిమేసి, కొత్త డీఎస్‌పీల‌కు అవ‌కాశం ఇచ్చారు. ఛార్జీల పేరుతో ఎలాంటి దోపిడీ లేకుండా డిజిట‌ల్ స‌ర్వీస్‌ని అందించే ప్రొవైడ‌ర్ తో ఒప్పందం చేసుకున్నారు. జ‌ర్మ‌నీకి చెందిన ఓ ఆర్థిక సంస్థ నుంచి నిధులు సేక‌రిస్తున్న ఐడీసీ కంపెనీతో టై- అప్ పెట్టుకున్నారు. స‌ర్వీసుల్లో నో అబ్జెక్ష‌న్ వీపీఎఫ్ మోడ‌ల్ విధానానికి తాజాగా ఒప్పందం సాగింది. దీని ప్ర‌కారం లేజ‌ర్ ప్రొజెక్ష‌న్ టెక్నాల‌జీ కోసం 1.50ల‌క్ష‌ల నుంచి 10ల‌క్ష‌ల వ‌ర‌కూ ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంది. 2కె డిజిట‌ల్ సినిమా లైన‌ప్ కోసం 15ల‌క్ష‌ల నుంచి 20ల‌క్ష‌ల మేర ఖ‌ర్చు తేలుతోంది. మొత్తానికి కోలీవుడ్ నిర్మాత‌లు, ఎగ్జిబిట‌ర్ అనుకున్న‌ది సాధించారు. అస‌లు ఈ ఉద్య‌మం మొద‌లైంది టాలీవుడ్‌లో అయినా అది ఇక్క‌డ నీరుగారిపోయింది. అక్క‌డ స‌క్సెసైంది. అయితే మ‌న నిర్మాత‌లే డిఎస్‌పీలుగా డిజిట‌ల్ రంగంలో పాతుకుపోయి ఉన్నారు కాబ‌ట్టి బంద్‌ని కావాల‌నే ఎత్తేశార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. అదంతా వేరే క‌థ‌.

  •  
  •  
  •  
  •  

Comments