ఉత్త‌మ్ గాలి తీసేసిన కోమ‌టిరెడ్డి!

Saturday, February 18th, 2017, 08:36:31 PM IST


పీసీసీ అధ్య‌క్ష‌పీఠం కాంగ్రెస్‌లో ముస‌లం రాజేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ పీఠం ఎవ‌రికి దక్కితే వారికి సొంత పార్టీ నేత‌ల నుంచే వ్య‌తిరేక‌త ఎదుర‌వుతుంది. కాంగ్రెస్‌లో అంత‌ర్గ‌త కుమ్ములాట‌కు కార‌ణ‌మ‌వుతుంటుంది ఆ పీఠం. ప్ర‌స్తుతం పీసీసీ అధ్య‌క్షుడిగా ఉన్న ఉత్త‌మ్‌కుమార్ రెడ్డికి అదే పెద్ద త‌ల‌నొప్పి వ్య‌వ‌హారంగా మారింది. ఎప్ప‌టినుంచో పీసీసీ అధ్య‌క్షుడు కావాల‌ని ఉవ్విళ్లూరుతున్న కోమ‌టిరెడ్డి నుంచి ఉత్త‌మ్‌కి లేనిపోని త‌ల‌నొప్పులు వ‌చ్చి ప‌డుతున్నాయ్‌. కోమ‌టిరెడ్డి ఇప్ప‌టికే ప‌లు సంద‌ర్భాల్లో ఉత్త‌మ్‌ని టార్గెట్ పెట్టుకుని విమ‌ర్శలు చేస్తున్నాడు. ప‌బ్లిక్ సాక్షిగా ఆయ‌న గాలి తీసేస్తున్నాడు. తాజాగా మ‌రోసారి ఆ ఇద్ద‌రి మ‌ధ్యా విభేదాలు ప‌బ్లిక్‌లోనే బ‌య‌ట‌ప‌డ్డాయి. ఇటీవ‌లే ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్‌కి ప్ర‌జ‌ల్లో విప‌రీతంగా ఆద‌ర‌ణ పెరుగుతోందంటూ డ‌బ్బాలు కొట్టిన సంగ‌తి తెలిసిందే. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌ని గెలిపించ‌నిదే గెడ్డం తీయ‌నని శ‌ప‌థం చేశాడు ఉత్త‌మ్‌.. అయితే దీనిపై కోమ‌టిరెడ్డి స్పందిస్తూ… మీసాలు, గెడ్డాలు తీసేసి ఇంట్లో కూచుంటే ఉప‌యోగం ఉండ‌దు.. రోడ్ల‌పైకి వ‌చ్చి ఉద్య‌మాలు చేస్తేనే కాంగ్రెస్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుస్తుంది అంటూ ఉత్త‌మ్‌ని ఎద్దేవా చేశాడు కోమటిరెడ్డి. స్వ‌ప‌క్షంలోనే ఉంటూ గాలి తీసేస్తూ మాట్లాడాడు కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి. దీంతో ఉత్త‌మ్ ఉస్సుర‌నిపోయాడు.

ఒకే పార్టీలో నేత‌ల మ‌ధ్య ఐక్య‌త లేక‌పోవ‌డం … కాంగ్రెస్ పుట్టి ముంచేలా ఉందంటూ గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఉత్త‌మ్‌పై స్వ‌ప‌క్ష నేత‌లైన సీనియ‌ర్లు జానా రెడ్డి ఇత‌ర‌త్రా నేత‌లు కారాలు, మిరియాలు నూరుతూనే ఉంటారు. అలాగే కోమ‌టిరెడ్డి నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర‌వుతోంది. క‌లిసే ఉందాం. క‌లిసిక‌ట్టుగా ఉందాం. విభేధాలు వ‌ద్ద‌నుకుంటున్నా కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య దూరం పెరుగుతూనే ఉంది.