కోమటి రెడ్డిని కేసీఆర్ లాగుతారా..?

Thursday, October 16th, 2014, 02:57:42 PM IST

kcr-komiti-reddy
తెలంగాణలో రసవత్తర రాజకీయాలకు తెర తీస్తున్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ తెలుగుదేశంపై ప్రయోగించిన ఆపరేషన్‌ ఆకర్శ్‌ సక్సెస్‌ కావడంతో కేసీఆర్‌ దృష్టి ఇక కాంగ్రెస్‌పైకి మళ్లినట్లు కనిపిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక నేతలుగా పేరుపొందిన కోమటిరెడ్డి బ్రదర్స్‌లో ఒకరైన వెంకటరెడ్డి సీఎం కెసిఆర్‌ను కలవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. కేసీఆర్‌తో ఢీ అంటే ఢీ అన్నట్లుగావ్యవహరిస్తున్న టీ-పీసీసీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్యను రాజకీయంగా దెబ్బతీసే లక్ష్యంగా ఆయన ప్రత్యర్థులను చేరదీస్తున్నట్లు తాజాగా జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే టి-సీఎల్పీ ఉప నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కెసిఆర్‌తో సమావేశమయ్యారని ప్రచారం జరుగుతోంది. గతంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో, ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలోనూ కోమటిరెడ్డి బ్రదర్స్‌ పలుమార్లు టీఆర్‌ఎస్‌ అధినేతగా ఉన్న కెసిఆర్‌తో భేటీ అయ్యారు.

గతంలోనే కోమటి రెడ్డి బ్రదర్స్ పార్టీ మారనున్నారనే ప్రచారం సాగింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు భువనగిరి ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి తిరిగి ఆ టికెట్‌ ఇవ్వవద్దని టీ-పీసీసీ చీఫ్‌ హోదాలో పొన్నాల అధిష్టానం వద్ద లాబీయింగ్‌ చేసినట్లు కోమటిరెడ్డి బ్రదర్స్‌ పలుమార్లు ఆరోపణలు గుప్పించారు. టికెట్ట పంపిణీ సమయంలోనూ కోమటిరెడ్డి బ్రదర్స్‌ పేర్లు టిఆర్‌ఎస్‌ ముఖ్యుల చర్చలలో ప్రస్తావనకు వచ్చాయి. భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనే పొన్నాల ప్రాతినిద్యం వహిస్తున్న జనగామ అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఉంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామలో పొన్నాలకు కాకుండా టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి ఓటు వేయాలని రాజగోపాల్‌ రెడ్డి ప్రచారం చేసినట్లు పొన్నాల సన్నిహితుల ఆరోపణ.

ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల సమయంలో సిఎల్పీ సమావేశానికి పొన్నాల హాజరైనందుకు నిరసనగా వెంకట రెడ్డి ఆ సమావేశం నుంచి వాకౌట్‌ చేయడం రాజకీయంగా సంచలనం సృష్టించింది. పొన్నాల, కోమటిరెడ్డి బ్రదర్స్‌ కాంగ్రెస్‌ నేతలే అయినప్పటికీ రాజకీయంగా ప్రత్యర్థులుగా కొనసాగుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన కెసిఆర్‌ కో మటిరెడ్డి బ్రదర్స్‌కు గాలం వేసినట్లు ప్రచారం జరుగుతోంది. కోమటిరెడ్డి బ్రదర్స్‌ను టీఆర్‌ఎస్‌లోకి లాగడం ద్వారా రాజకీయంగా పొన్నాల దూకుడుకు కళ్లెం వేయాలన్న ఆలోచనలో కెసిఆర్‌ ఉన్నట్లు సమాచారం.