కేటీఆర్: పురపాలిక ఎన్నికలలో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయాలి

Thursday, July 11th, 2019, 11:01:14 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గెలిచి రెండో సారి అధికారాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించగా, కేసీఆర్ తనయుడు కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే అసెంబ్లీ ఎన్నికల తరువాత వచ్చిన లోక్‌సభ ఎన్నికలకు సిద్దమైన టీఆర్ఎస్ పార్టీకీ కాస్త చేదు అనుభవమే మిగిలిందని చెప్పుకోవాలి. అనుకున్న స్థాయిలో మెజారిటీ స్థానాల్ను దక్కించుకోలేకపోయింది.

అయితే కొద్ది రోజుల క్రితం జరిగిన పరిషత్ ఎన్నికలు టీఆర్ఎస్‌కు కాస్త ఊపును తెచ్చి పెట్టాయి. దాదాపు మెజారిటీ స్థానాలను టీఆర్ఎస్ పార్తీ కైవసం చేసుకోగా మరి కొద్ది రోజుల్లో రానున్న పురపాలక సంఘాల ఎన్నికలలో అత్యధిక స్థానలను గెలుచుకోవాలని టీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అయితే ఈ ఎన్నికలపై కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించారట. దాదాపు అన్ని స్థానాలు టీఆర్ఎస్ ఖాతాలోనే పడాలని ఇప్పటికే నేతలకు పలు సూచనలు జారీ చేస్తున్నాడట. పురపాలక సంఘాలవారీగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ప్రచారం నిర్వహించాలని వార్డుల వారిగా బాధ్యతలను ముఖ్యనేతలకు అప్పచెప్పాలని భావించారట. నగరపాలక సంస్థలతోపాటు ప్రధాన పురపాలక సంఘాలలో ప్రచారానికి తానే స్వయంగా హాజరవుతానని కూడా చెప్పుకొచ్చారట.