కుంతియా సంచలన వాఖ్యలు – నీతినియమాలు లేని నాయకులు వాళ్ళు

Thursday, June 13th, 2019, 03:33:29 AM IST

ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి హాజరైన తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి కుంతియా ఇటీవల తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీని వదిలి తెరాస లో కలిసిన నేతలపై విరుచుకపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ గుర్తుపై గెలిచి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరడం అనైతిక చర్య అని విమర్శలదాడి చేశారు. కేవలం డబ్బు సంపాదించడమే లక్ష్యంగా వారు రాజకీయాల్లోకి వచ్చారని, అందుకే ఇలా ఎవరు డబ్బులు ఎక్కువగా ఇస్తే వారి పార్టీలోకి మారిపోతున్నారని కుంతియా అన్నారు. వారికే గనక నీతి నియమాలు, దమ్మూ దైర్యం ఉంటే టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన అందరూ రాజీమానా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని సవాల్‌ విసిరారు. తెలంగాణ ముఖ్యమంత్రి కావాలనే ఇలా కుట్రపూరితమైన రాజకీయాలు చేస్తున్నారని, పనిగట్టుకొని మరీ కాంగ్రెస్ నేతలను తెరాస లో కలుపుకునేందుకు ప్రయత్నించారని, ఈ పనేదో తెలంగాణాని అభివృద్ధి చేసేందుకు వాడితే బాగుండేది అని కుంతియా అన్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై హైకోర్టులో పిటిషన్‌ కూడా వేశామని, గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేశామని, ప్రస్తుతానికి ఈ అంశంపై హైకోర్టులో కూడా కేసు నడుస్తోందని చెప్పారు. ఈ కేసులో గెలుపు తమదేనని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇకపోతే తెలంగాణాలో ప్రజల్లో తెరాస మీద నమ్మకం తగ్గిందని, ప్రజాదరణ కోల్పోతున్న పార్టీ తెరాస అని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన పరిస్థితి చూసైనా కూడా కెసిఆర్ మారకపోతే వారికి తగైనా గుణపాఠం చెప్పడానికి తామెప్పుడూ సిద్దమే అని తెలిపారు.