టిడిపికి ఊహించని షాక్..పసుపు అక్షరాలతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఫస్ట్ లుక్..!

Tuesday, September 26th, 2017, 08:43:18 PM IST

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నంత పని చేశారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మి పార్వతి ఎలా వచ్చిందనే పాయింట్ పై భావోద్వేగమైన చిత్రాన్ని తెరకెక్కిస్తానని ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ ఆ ప్రయత్నంలో తొలి అడుగు వేశారు. కొద్ది సేపటి క్రితమే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. టైటిల్ లోని ఎన్టీఆర్ అనే అక్షరాలు టీడీపీ రంగు పసుపు వర్ణంలో ఉండడం ఆసక్తిగా మారింది. యాదృచ్చికంగా టైటిల్ ని అలా డిజైన్ చేశారా లేక ఉద్దేశపూర్వకంగానే ఆర్జీవీ పసుపు రంగుని వాడారా అనేది తెలియాల్సి ఉంది.

కాగా ఒకసారి ఫస్ట్ లుక్ ని పరిశీలిస్తే లక్ష్మీ పార్వతి పాత్రకు సంబందించిన వ్యక్తి గుమ్మం లోపలికి అడుగుపెడుతున్నట్లు కనిపిస్తోంది. ఇంటిలోపల కుర్చీలో ఎన్టీఆర్ పాత్ర దారుడు కూర్చుని ఉన్నారు. కాగా ఈ లుక్ లో రెండు క్యారెక్టర్ల ముఖాలని ఆర్జీవీ దాచేశాడు. బహుశా తదుపరి విడుదలచేయబోయే లుక్ లో క్యారెక్టర్ లని పరిచయం చేస్తాడేమో.

ఇక ఈ చిత్రంపై అటు తెలుగు దేశం పార్టీ నుంచి ఇటు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి పార్వతి నుంచి పలు అభ్యంతరాలు ఉన్నాయి. ఎన్టీఆర్ లక్ష్మి పార్వతిని వివాహం చేసుకున్న తరువాత ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆ వివాదాలలో టిడిపి అధినేత చంద్రబాబు, మరియు ఇతర ప్రముఖ రాజకీయ నాయకుల పాత్ర ఉందనేది బహిరంగ రహస్యం. ఈ నేపథ్యంలో తమ అనుమతి లేకుండా చిత్రాన్ని తీస్తే ఊరుకునేది లేదని ఇప్పటికే టిడిపి ఆర్జీవీ ని హెచ్చరించింది. మరో వైపు లక్ష్మి పార్వతి కూడా ఆర్జీవీ ని డిమాండ్ చేసింది. జరిగినది జరిగినట్టుగా, తన మనో వేదనని, ఎన్టీఆర్ మనోవేదనని చిత్రీకరిస్తే తప్పకుండా మద్దత్తు తెలిపుతానని అన్నారు. వక్రీకరించి తీస్తే ఊరుకునేది లేదని ఆమె కూడా ఆర్జీవీ కి వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి సెన్సిటివ్ పాయింట్ పై చిత్రాన్ని తీసే సాహసం ఆర్జీవీ ప్రారంభించేశారు. ఈ చిత్ర విషయంలో ఎలాంటి మలుపులు చోటుచేసుకుంటాయి వేచి చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments