కిలాడీ దంప‌తుల‌కు కోర్ట్ నోటీసులు

Thursday, May 10th, 2018, 04:13:11 PM IST

కిలాడీ అక్ష‌య్ కుమార్ వివాదాల్లోకి వ‌చ్చారు. ఆయ‌న `రుస్తుం` సినిమాలో ఉప‌యోగించిన ఓ డ్రెస్ అందుకు కార‌ణం. ఇంత‌కీ ఏమైందంటే.. గ‌తంలో రుస్తుం సినిమాలో అక్ష‌య్ ధ‌రించిన నావ‌ల్ క‌మాండ‌ర్ డ్రెస్‌ని అక్ష‌య్‌- ట్వింకిల్ ఖ‌న్నా(చిత్ర నిర్మాత‌) జంట వేలానికి పెట్టింది. అయితే ఇలా చేయ‌డం ద్వారా మ‌ర‌ణించిన‌ నావీ అధికారుల్ని, వారి భార్య‌ల్ని తీవ్రంగా అవ‌మానించార‌ని, సెంటిమెంటును గాయ‌ప‌రిచార‌ని నెటిజ‌నులు దుమ్మెత్తిపోశారు. గ‌త నెల‌ 26న అక్ష‌య్ ఈ వేలం గురించి ప్ర‌క‌టించ‌గానే సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. సందీప్ అహ్లావ‌త్ అనే ఓ నెటిజ‌న్‌ ఫేస్‌బుక్ ద్వారా విమ‌ర్శ‌లు కురిపించారు.

అయితే దానిపై రిప్ల‌య్ ఇచ్చిన ట్వింకిల్ ఖ‌న్నా.. త‌న‌ను ఇలా ఆన్‌లైన్ వేదిక‌గా తూల‌నాడ‌డం త‌గ‌ద‌ని చ‌ట్ట‌ప‌రంగా ఎదుర్కోవాల‌ని స‌వాల్ విసిరారు. అయితే ఆ వివాదాన్ని అక్క‌డితో వ‌దిలేయ‌కుండా ఇప్పుడు కొంద‌రు సీరియ‌స్‌గా తీసుకున్నారు. ఆ క్ర‌మంలోనే అక్ష‌య్‌- ట్వింకిల్ జంట‌కు చ‌ట్ట‌ప‌రంగా కోర్టు నోటీసులు అంద‌డం సంచ‌ల‌న‌మైంది. ఈ వివాదాన్ని కిలాడీ దంప‌తులు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.