బందరు పోర్టు వ్యవహారం రోజురోజుకి రచ్చ రచ్చ అవుతున్న సంగతి తెలిసిందే. భారీగా రైతుల నుంచి భూసమీకరణ చేయాల్సిన అవసరం ఉండడంతో ఇక్కడ రాజకీయ పార్టీలు తిష్ఠ వేసి మరీ ప్రభుత్వానికి అడ్డు చెబుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష వైకాపా అధినేత జగన్ ఈ విషయాన్ని రాజకీయం చేస్తుండడంపై అధికారపక్షం మండిపడుతోంది.
రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి వైఎస్ఆర్సీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని తేదేపా యువనేత, పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు నారా లోకేష్ సీరియస్ అయ్యారు. బందరులో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో లోకేష్ తనదైన శైలిలో ఫైరయ్యారు. ఎవరెన్ని కుట్రలు చేసినా పోర్ట్ నిర్మాణాన్ని ఆపలేరు. ముందుకే వెళతాం. 2018 నాటికి పూర్తి చేస్తామని లోకేష్ ప్రకటించారు. భూముల సేకరణను వైకాపా అడ్డుకునేందుకు యత్నిస్తోంది. జగన్ నివాసానికి 32 ఎకరాలు కావాలి కానీ.. బందరు పోర్టుకు అవసరం లేదా? అంటూ చెలరేగిపోయారు. పోర్టు అభివృద్ధినే కాదు, రాష్ట్ర అభివృద్ధిని జరగకుండా జగన్ అడ్డుకుంటున్నారని నిందించారు.