అధికారుల బ‌దిలీ వెన‌క `లోక‌ష్‌` రాజ‌కీయం?

Sunday, November 13th, 2016, 03:48:21 PM IST

lokesh
ప‌వ‌ర్‌పాలిటిక్స్‌: అధికారుల‌పై లోకేష్ పెత్త‌నంపై కంప్లైంట్లు

ప‌వ‌ర్ పాలిటిక్స్‌కి కేరాఫ్ అడ్రెస్‌గా చిన‌బాబు పేరే వినిపిస్తోంది. ఇంతింతై వ‌టుడింతై అన్న చందంగా లోకేష్ నాయుడు ఏపీ పాలిటిక్స్‌లో ఎదిగార‌న్న‌ది పార్టీ ఇన్‌సైడ్ టాక్‌. ఎంత‌గా అంటే త‌న‌కి న‌చ్చ‌ని ఎవ‌రినైనా అత‌డు ఈజీగా పార్టీకి దూరం పెట్టేసేంత‌గా ఎదిగేశాడ‌ని ముచ్చ‌టించుకుంటున్నారు. పార్టీనేత‌ల ప‌ద‌వుల మార్పిడి నుంచి న‌చ్చ‌ని అధికారుల్ని తొల‌గించ‌డం వ‌ర‌కూ లోకేష్ దందా య‌థేచ్ఛ‌గా సాగిపోతోంద‌ని ప‌లువురు చెప్పుకుంటున్నారు. ప్ర‌భుత్వంలో ఇప్పుడు లోకేష్ ఏం చెబితే అదే చెల్లుతోంది. సీఎం చంద్ర‌బాబు త‌ర్వాత చిన‌బాబుదే హ‌వా అంటూ తేదేపా నేత‌లే అంగీక‌రిస్తున్న మాట‌.

అంతేకాదు 2019 ఎన్నిక‌ల్లో టిక్కెట్ల పంపిణీ వ్య‌వ‌హారంలో లోకేష్ పాత్ర ఎంతో కీల‌కం కానుంది. మంత్రి కాకుండానే మంత్రిగా అన్నిర‌కాల అధికారాల్ని లోకేష్ చెలాయిస్తున్నారు. అన్ని కీల‌క శాఖ‌ల్లోనూ వేలు పెడుతున్నారు. త‌న‌కి న‌చ్చ‌ని అధికారుల్ని బ‌దిలీ చేయిస్తున్నారు. అంతెందుకు సీఎం భ‌ద్ర‌తా సిబ్బందిలో ఇద్ద‌రు కీల‌క అధికారుల్ని లోకేష్ బ‌దిలీ చేయించారు. బాబు సీఎం కాక‌ముందు నుంచీ ఆ ఇద్ద‌రూ సెక్యూరిటీగా ఉండేవారు. చిన‌బాబు రాక‌తో ఆ ఇద్ద‌రి ఫేట్ మారిపోయింది. సీఆర్‌డీఏ ఐఏఎస్ అధికారి నాగులాప‌ల్లి శ్రీ‌కాంత్‌పై వేటు ప‌డ‌డానికి కార‌కుడు లోకేష్ అంటూ అప్ప‌ట్లో వార్త‌లు గుప్పుమ‌న్నాయి. జిల్లాల్లో పోలీస్ అధికారుల పోస్టింగుల నుంచి, అత్యంత కీల‌క‌మైన హోంశాక‌లో బ‌దిలీల వ్య‌వ‌హారం అంతా లోకేష్ క‌నుస‌న్న‌ల్లోనే సాగాల్సి వ‌స్తోంద‌ని కొంద‌రు అధికారులు వాపోవ‌డం చ‌ర్చ‌కొచ్చింది. `ప‌వ‌ర్ పాలిటిక్స్‌` అన్న ప‌దానికి కేరాఫ్ అడ్రెస్‌గా లోకేష్ మారార‌ని లోకం కోడై కూస్తోంది.