సహనం కోల్పోయిన కాంగ్రెస్ నేత

Tuesday, September 23rd, 2014, 04:04:36 PM IST

shilaga
అనంతపురం కళ్యాణదుర్గంలో టిడిపి ప్రభుత్వ తీరును నిరసిస్తూ సోమవారం మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శైలజానాధ్ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. అలాగే ముట్టడి కన్నా ముందు పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి నివాసం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, కార్యాలయం వద్ద 2గంటలపాటు శైలజానాధ్ బైఠాయించారు. ఈ సందర్భంగా శైలజానాద్ మాట్లాడుతూ రైతులు, మహిళలను నట్టేట ముంచిన ముఖ్యమంత్రి చంద్రబాబును చెట్టుకు ఉరితీయాలని వివాదాస్పదంగా మాట్లాడారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ యోగ్యత లేనప్పుడు హామీలు గుప్పించి రైతులను, మహిళలను మోసం చెయ్యడం ఎంత వరకు సమంజసమని నిలదీశారు. ‘ఎన్నికల హామీలలో ఏ ఒక్కటైనా నేరవేర్చారేమో ప్రజల ముందుకొచ్చి ధైర్యంగా చెప్పగలరా?’ అంటూ శైలజానాద్ సూటిగా ప్రశ్నించారు. 2004లో అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే ఉచిత విద్యుత్ ను అమలు చేసిందని ఈ సందర్భంగా శైలజానాధ్ గుర్తు చేశారు.