మా అధ్య‌క్షుడిపై అభియోగం?

Sunday, September 2nd, 2018, 04:09:13 PM IST

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) అధ్య‌క్షుడి ప‌ద‌వి నుంచి శివాజీ రాజాని త‌ప్పించార‌న్న ప్ర‌చారం సాగుతోంది. ఈ ఆక‌స్మిక నిర్ణ‌యం వెన‌క అస‌లు కార‌ణాలేంటి? ఉన్న‌ట్టుండి శివాజీరాజాని ఎందుకు ప‌ద‌వి నుంచి త‌ప్పించారు? రికార్డుల మాయం వెన‌క అస‌లు నిజాలేంటి? ఇంత‌కీ అమెరికాలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా నిర్వ‌హించిన సిల్వ‌ర్ జూబ్లీ ఈవెంట్ తో వ‌చ్చిన కోటి ఫండ్‌ని ఏం చేశారు? అధికార దుర్వినియోగంతో పాటు, ఆ నిధిని పూర్తిగా కైంక‌ర్యం చేశారా?.. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ ఇది. ప్ర‌ఖ్యాత ఆంగ్ల ప‌త్రిక డెక్క‌న్ క్రానిక‌ల్‌ క‌థ‌నంపై ఫిలింన‌గ‌ర్‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

మూవీ ఆర్టిస్టుల సంఘం సొంత భ‌వంతి నిర్మాణం కోసం ఈ ఏడాది రెండు భారీ ఈవెంట్ల‌ను మా అసోసియేష‌న్ ప్లాన్ చేసింది. అమెరికాలో మెగాస్టార్ చిరంజీవి అతిధిగా ఇప్ప‌టికే ఓ భారీ ఈవెంట్ జ‌రిగింది. ఆ ఈవెంట్‌కి ఎన్నారైల నుంచి అద్భుత స్పంద‌న రావ‌డంతో కోటి నిధి క‌లెక్ట్ అయ్యింద‌ని మా అధ్య‌క్షుడు శివాజీ రాజా ఇదివ‌ర‌కూ అధికారికంగా ప్ర‌క‌టించారు. అయితే ఈ నిధిని దుర్వినియోగ ప‌రిచారంటూ ప్ర‌ఖ్యాత డెక్క‌న్ క్రానిక‌ల్ క‌థ‌నం ప్ర‌చురించ‌డంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈవెంట్ కోసం అమెరికా ప‌య‌న‌మైన‌ప్పుడు విమాన ప్ర‌యాణం ఖ‌ర్చులు స‌హా ప్ర‌తిదాంట్లో పార‌ద‌ర్శ‌క‌త క‌నిపించ‌లేద‌ని, రికార్డులు మాయ‌మ‌య్యాయ‌ని .. దీనిపై ప్ర‌శ్నిస్తే శివాజీ రాజా మాట దాట వేస్తున్నార‌ని స‌ద‌రు క‌థ‌నం పేర్కొంది.

ఇక‌పోతే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్ ముఖ్య అతిధిగా మ‌రో భారీ ఈవెంట్‌కి స‌న్నాహాలు చేస్తోంది. ప్ర‌స్తుత వివాదంతో ఈ ఈవెంట్‌కి ఇబ్బందే. అయితే డీసీ పేర్కొన్న క‌థ‌నంలో వాస్త‌వాలు ఎంత‌? అన్న‌ది ప్ర‌స్తుతం మా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్న సీనియ‌ర్ న‌రేష్ అధికారికంగా ప్ర‌క‌టిస్తారేమో అన్న చ‌ర్చా మూవీ ఆర్టిస్టుల్లో న‌డుస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments