మాఫియా థ్రెట్‌ : 25 ల‌క్ష‌లు తేవాలంటూ నిర్మాత‌కు బెదిరింపు!

Sunday, October 22nd, 2017, 04:45:54 PM IST

ముంబైని ఒణికించిన అండ‌ర్‌వ‌ర‌ల్డ్ డాన్ దావూద్ ఇబ్ర‌హీం ఏళ్లుగా విదేశాల్లో త‌ల‌దాచుకుంటూ పోలీసుల‌కు లేనిపోని త‌ల‌నొప్పి వ్య‌వ‌హారంగా త‌యార‌య్యాడు. గ‌ల్ఫ్ దేశాల్లో ఉంటూనే ఇండియాకి ఏదో ఒక ముప్పు ఎలా తేవాలా? అని ఆలోచిస్తుంటాడు దావూద్‌. అందుకే ఇటీవ‌లి కాలంలో అత‌డి ఆస్తుల జ‌ప్తు కోసం, అత‌డిని ఆర్థికంగా దిగ్భంద‌నం చేయ‌డం కోసం మ‌న ప్ర‌భుత్వాలు అన్ని మార్గాల్ని అన్వేషించాయి. దావూద్ ముంబైలో తిరిగిన రోజుల్లో బాలీవుడ్ ఒణికిపోయేది. ప్ర‌ముఖ నిర్మాత‌లంద‌రికీ అత‌డి అనుచ‌రుల నుంచి థ్రెట్ కాల్స్ వ‌చ్చేవి. భారీగా డ‌బ్బు చెల్లించ‌క‌పోతే చంపేస్తామంటూ బెదిరింపుల‌కు పాల్ప‌డేవారు. అయితే ముంబై పోలీస్ చ‌లువ వ‌ల్ల దావూద్ దేశం దాటి పోవాల్సొచ్చింది.

కానీ మ‌న‌కు తెలియ‌ని దావూద్‌లో లోక‌ల్‌గా ఇంకా చాలామందే ఉన్నారు. చోటా మోటా డిమాండ్ల‌తో చిల్ల‌ర దండుకునే బాప‌తుకైతే కొద‌వే లేదు. అప్ప‌ట్లో దావూద్ లేక‌పోయినా కొంద‌రు మాఫియా.. స్టార్ల‌కు ఫోన్ చేసి డ‌బ్బు డిమాండ్ చేసిన సంద‌ర్భాలు ఎదుర‌య్యాయి. తాజాగా నిర్మాత ఆదిత్య పాంచోళికి అలాంటి కాల్ ఒక‌టి వ‌చ్చింది. వెంట‌నే 25ల‌క్ష‌లు చెల్లంచ‌క‌పోతే చంపేస్తామంటూ స‌ద‌రు అగంత‌కుడు ఫోన్ చేసి బెదిరించాడు. వారం రోజులుగా అత‌డి నుంచి మెసేజ్‌లు, కాల్స్ వ‌స్తున్నాయి. మున్నా పుజారి పేరుతో ఫోన్‌లు, మెసేజ్‌లు వ‌స్తున్నాయ‌ని ఆదిత్య పాంచోళి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ముంబై వెర్సోవా పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఇటీవ‌లే ప్ర‌ముఖ క‌థానాయిక కంగ‌న ర‌నౌత్‌పో పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన పాంచోళి నాలుగైదు రోజుల్లోనే మ‌రో రాంగ్ రీజ‌న్‌తో పోలీస్ గ‌డ‌ప తొక్కాల్సొచ్చింది. అస‌లింత‌కీ ఆ థ్రెట్ కాల్స్ చేయించిందెవ‌రు?