బాపురెడ్డి,రమాదేవిల మేడారం ‘మహా సాక్షాత్కారం’అద్భుతం.

Friday, February 7th, 2020, 02:01:38 PM IST

ఆవిష్కరించిన అధికార భాషా సంఘం చైర్మన్ దేవులపల్లి ప్రభాకరరావు

హైదరాబాద్ ; ఫిబ్రవరి; 7

గత రెండు దశాబ్దాలుగా మేడారం జాతర ప్రత్యేక సంచికలు వెలువరిస్తూ … తెలంగాణా వ్యాప్తంగా విశేష ఖ్యాతి సంపాదించుకున్న ‘ సమ్మక్క సారలమ్మ సేవాసమితి ‘ఈ సంవత్సరం మేడారం జాతర సందర్భంగా సుమారు వంద పేజీలతో విడుదల చేసిన ‘ మహా సాక్షాత్కారం’ ప్రత్యేక సంచికను జాతర రెండవ రోజు గురువారం నాడు సమ్మక్క సారక్క గద్దెకు సమర్పించడం విశేషం.

జాతరలో ఈ సంచిక ప్రత్యేక ఆకర్షణగా నిలవడమే కాకుండా ‘ సమ్మక్క సారలమ్మ సేవాసమితి ‘ ప్రచురణగా ఈ ‘మహా సాక్షాత్కారం’ గ్రంధాన్ని అందించిన సంకలనకర్తలు పెసరు బాపురెడ్డి, శ్రీమతి పెసరు రమారెడ్డి దంపతులను మేడారం జాతర పర్యవేక్షిస్తున్న తెలంగాణా మంత్రులు, ఐపీఎస్ అధికారులు అభినందించడం ప్రత్యేక విశేషంగానే చెప్పాలి.

గురువారంనాడు మేడారంలో సమ్మక్క సారలమ్మ గద్దెను దర్శించి ఈ పుస్తకాన్ని వేలాది భక్తులకు బాపురెడ్డి, రమారెడ్డి దంపతులు స్వయంగా అందించి ప్రశంసలు అందుకోవడం అభినందనీయం.

మరో ప్రక్క హైదరాబాద్ త్యాగరాయ గానసభలో శుక్రవారం నాడు వందలాది రసజ్ఞుల మధ్య ఈ ‘ మహాసాక్షాత్కారం’ గ్రంధాన్ని ఆవిష్కరించిన తెలంగాణా అధికార భాసంఘం అధ్యక్షులు డాక్టర్ దేవులపల్లి రామానుజ రావు మాట్లాడుతూ పెసరు బాపురెడ్డి, శ్రీమతి పెసరు రమారెడ్డి అనే ఒక దంపతుల జంట ఇలాంటి మహాకార్యాన్ని భుజాలకెత్తుకుని ఇన్ని సంవత్సరాలుగా నిస్వార్ధంగా ఈ ప్రత్యేక సంచికలు అందించడం మేడారం మహా అనుగ్రహం వల్లనే సాద్యమని ప్రశంసించారు.

ఈ సంచిక ఆవిష్కరణ సభకు అధ్యక్షత వహించిన త్యాగరాయ గాన సభ అధ్యక్షులు కళా జనార్ధనమూర్తి మాట్లాడుతూ మహా సాక్షాత్కారం గ్రంధం వెనుక వున్న కష్టం, తపన, సాహిత్య విలువలు అడుగడునా దర్శనమిస్తున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా బాపురెడ్డి, రమారెడ్డి దంపతుల కృషిని ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో అర్చన సంస్థ వ్యవస్థాపకులు వెంకటేస్వర రావు, వై .ఎస్సార్. చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వై.ఎస్సార్ మూర్తి , శ్రీమతి శివ పార్వతి తదితరులు పాల్గొన్నారు.

మొత్తమ్మీద తెలంగాణా మేడారం జాతరలో ఈ సంవత్సరం జరిగిన అద్భుత ఘట్టాలలో
సమ్మక్క సారలమ్మ సేవాసమితి ‘ వారి మహా సాక్షాత్కారం గ్రంధం ఒక ‘ యాది ‘ గా నిలిచిందని చెప్పితీరాల్సిందే. బాపురెడ్డి, రమాదేవిలా కృషికి వచ్చేసారి మనమూ చేయి కలిపితే దైవం మనకూ అనుకూలిస్తుంది వేరే చెప్పఖ్ఖర్లేదు.

ఈ పుస్తక ప్రచురణలో బాపురెడ్డి, రమాదేవిల నిస్వార్ధ సేవకు హనుమకొండకు చెందిన మరోప్రముఖులు ఈదులకంటి సత్యనారాయణ రెడ్డి, శ్రీమతి ప్రసన్న తోడుగా ఉండటం అమ్మవార్ల అనుగ్రహమే మరి.