1000 కోట్ల `మ‌హాభార‌తం` ఇంకా సందిగ్ధ‌మే?

Monday, April 9th, 2018, 08:00:09 PM IST

మిస్ట‌ర్ పెర్ఫెక్ట్ అమీర్‌ఖాన్ `మ‌హాభార‌తం -3డి`ని ఐదు భాగాలుగా తెర‌కెక్కిస్తున్నాన‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దాదాపు 1000 కోట్ల బ‌డ్జెట్ ఖ‌ర్చు అయ్యే ఈ ప్రాజెక్టుకు రిల‌య‌న్స్ అంబానీ పెట్టుబ‌డులు స‌మ‌కూర్చేందుకు సిద్ధ‌మ‌య్యారు. అయితే ఈ సినిమా ఇంకా ప‌ట్టాలెక్కేవ‌ర‌కూ సందేహ‌మేన‌ని తాజా స‌న్నివేశం చెబుతోంది. మ‌హాభార‌తం లాంటి పురాణేతిహాసాన్ని తెర‌కెక్కించే ముందు ఎన్నో ఆలోచించాలి. ప్ర‌స్తుత స‌న్నివేశంలో ప్ర‌తి సినిమా ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంది. ఇటీవ‌ల ప‌ద్మావ‌త్ విష‌యంలో త‌లెత్తిన వివాదాలు త‌న సినిమాని చుట్టుముడితే ప‌రిస్థితేంటి? అన్న‌ది అమీర్ సీరియ‌స్‌గా ఆలోచిస్తున్నారుట‌. అందుకే ఇంకా ఈ ప్రాజెక్టును ప‌ట్టాలెక్కించే విష‌యంలో ఒక‌టికి రెండు సార్లు పున‌రాలోచిస్తున్నాడ‌ట‌. ప‌ద్మావ‌త్‌ నిర్మాత‌గా భ‌న్సాలీ త‌ర‌హాలోనే ఆప‌ద‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుందా? అన్న సందేహాలు అమీర్‌కి ఉన్నాయిట‌. మొత్తానికి అత‌డిలో ఏదో తెలియ‌ని భ‌యం ప‌ట్టుకుంది. వంద‌ల కోట్ల పెట్టుబ‌డులు వెద‌జ‌ల్లే భారీ ప్రాజెక్ట్ కాబ‌ట్టే ఇంత‌టి త‌ర్జ‌న భ‌ర్జ‌న‌. ఇప్ప‌టికైతే ఈ సినిమాని ప‌క్క‌న‌బెట్టి, కాస్త తీరిగ్గా తిరిగి ఆలోచించాల‌ని అనుకుంటున్నాడ‌ట‌.

అయితే అంత పెద్ద క్రేజీ ప్రాజెక్టును ప్ర‌క‌టించాక‌, ఇలా వెన‌క‌డుగు వేయ‌డం మాత్రం అభిమానుల్ని నిరాశ‌లో కూరుకుపోయేలా చేస్తోంది. మ‌హాభార‌తంకు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఫాలోవ‌ర్స్‌ను దృష్టిలో పెట్టుకుంటే ఈ సినిమాని 3డిలో చూడాల‌ని ఉవ్విళ్లూరేవారి వారి సంఖ్య తెలుస్తుంది. ఇక‌పోతే అయిన‌దానికి కాని దానికి సినిమావాళ్ల‌పై ప‌డే వారి వ‌ల్ల‌నే ఈ స‌మ‌స్య అంతా. ప‌ద్మావ‌త్‌ని రాజ్‌పుత్‌లు వివాదాల్లోకి లాగిన‌ట్టే మ‌హాభార‌తంని లాగేందుకు ఎవ‌రైనా కాపు కాసుకుని కూచున్నారంటారా? అందుకే అమీర్ భ‌య‌ప‌డుతున్నాడా? ఇంకేవైనా రాజ‌కీయ కారణాలు ఇందులో ఉన్నాయా? అన్న‌ది వేచి చూడాల్సిందే.

  •  
  •  
  •  
  •  

Comments