కొరటాలకి మహేష్ సర్ప్రైజ్ గిఫ్ట్…ఏంటో తెలుసా..?

Tuesday, May 8th, 2018, 06:00:08 PM IST

మహేష్ బాబు చాలా సున్నిత మనస్కుడు. చాలా తక్కువగా మాట్లాడుతూ… ఎంతో హుందాగా వ్యవహరించే సూపర్ స్టార్ బిహేవియర్ కే చాలామంది ఫ్యాన్స్ అయిపోతుంటారు. మహేష్ ఓ విషయంలో మాత్రం చాలా ఉదారంగా ఉంటాడు. తనకు ఎవరైనా నచ్చితే… వాళ్లకి గిఫ్ట్లమీద గిఫ్టులు ఇచ్చేస్తుంటాడు. ఇప్పుడు ఆ బహుమతుల వానలో తడిసి ముద్దవుతున్నాడు కొరటాల శివ.

రెండు వరుస డిజాస్టర్ల తర్వాత ‘భరత్ అనే నేను’ సినిమా చేశాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఓపెనింగ్స్ కూడా భారీగా వచ్చాయి. మొదటి వీకెండ్ మంచి షేర్ కూడా సాధించింది. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మహేష్ బాబు నటనకి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. దీంతో తన ఆనందాన్ని చెప్పేందుకు దర్శకుడు కొరటాల శివకి హైదరాబాద్ నగర శివారులో ఓ లగ్జరీ విల్లా బహుమతిగా ఇచ్చాడట ప్రిన్స్. దీని ఖరీదు ఎంతో తెలియకపోయినా కొన్ని కోట్లలోనే ఉంటుంది. రెమ్యూనరేషన్ గా కూడా మంచి రేటు పొందిన కొరటాలకి ఈ బహుమతి బోనస్ అని చెప్పొచ్చు. ఇంతకు ముందు శ్రీమంతుడు సినిమా సక్సెస్ తర్వాత కొరిటాల శివకి ఓ లగ్జరీ కారు బహుకరించాడు ప్రిన్స్.

‘భరత్ అనే నేను’ సినిమా వల్ల ఇంకా బయ్యర్లకి లాభాలు రాకపోయినా బన్నీ ‘నా పేరు సూర్య’ సినిమాకి మిక్స్డ్ టాక్ రావడంతో ఆ ప్రభావం మళ్లీ భరత్ పైన పడే అవకాశం కనిపిస్తోంది. లాంగ్ రన్లో హిట్ ఖాతాలోకి చేరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంతలా బహుమతులు ఇచ్చే అలవాటు ఉన్న మహేష్ ని ‘టాలీవుడ్ శాంతా క్లాజ్’ అంటున్నారు ఆయన అభిమానులు.

  •  
  •  
  •  
  •  

Comments