జూలో తాబేలుపై నిలబడి ఫోటో: అదుపులో నిందితుడు

Thursday, February 19th, 2015, 12:20:13 PM IST


హైదరాబాద్ నెహ్రూ జూపార్కులో వన్య ప్రాణుల ఎన్ క్లోజర్ లోకి దిగి వాటితో ఫోటోలు దిగడంతో పాటు తాబేలుపై నించుని ఒక యువకుడు దిగిన ఫోటో ఇప్పుడు కలకలం రేపుతోంది. కాగా ఇప్పటికే సోషల్ సైట్లలో హల్ చల్ చేస్తున్న ఈ ఫోటోపై ఇంగ్లీష్ పత్రికలు కూడా కధనాలు రాయడంతో జూ యాజమాన్యం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇక ఈ సందర్భంగా జూ క్యూరేటర్ జీ రామకృష్ణారావు మాట్లాడుతూ ఈ ఘటనపై వెంటనే విచారణ మొదలెట్టామని, ఆ ఫోటోలోని వ్యక్తిని ఫజల్ షేక్ గా అనుమానిస్తూ బహుదూర్ పురా పోలీసులకు పిర్యాదు చేశామని తెలిపారు.

అలాగే ఆ ఫోటో గత ఏడాది జూన్, జూలైలో దిగి ఉండవచ్చునన్న అనుమానాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. ఇక ఉదయం 9 నుండి 10.30 గంటల మధ్య వన్యప్రాణుల ఎన్ క్లోజర్ లోని ప్రవేశించి యానిమల్ కీపర్లు వ్యర్ధపదార్ధాలను తొలగిస్తారని, ఆ సమయంలోనే ఫోటోలోని వ్యక్తి లోపలి ప్రవేశించి ఉండవచ్చునని రామకృష్ణారావు అభిప్రాయపడ్డారు. ఇక ఈ ఘటనతో జూ పార్కులోని భద్రతను కట్టుదిట్టం చేశామని, జంతువుల పట్ల సామరస్యంగా మెలగాలని లేకపోతే అటవీ యాక్ట్ కింద శిక్షకు గురవుతారనే విషయాన్ని మైక్ ద్వారా ప్రచారం చేస్తున్నామని ఆయన వివరించారు. కాగా ఫోటోలోని అనుమానితుడు ఫజల్ షేక్ ను బుధవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.