రూ.70 కోట్లతో మంచు విష్ణు ప్రయోగం..!

Tuesday, February 6th, 2018, 02:18:40 PM IST

మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు గత కొంత కాలంగా భారీ హిట్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. మొన్నటి వరకు యాక్షన్ కామెడీ వంటి సినిమాలతో తనదైన శైలిలో అలరించిన విష్ణు రానున్న రోజుల్లో ఓ సరికొత్త సినిమాతో రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. గత కొంత కాలంగా విష్ణు ఒక భక్తిరస చిత్రాన్ని తెరకెక్కించాలని బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడు. తనికెళ్ళ భరణి రచించిన ఆ కథ ను తెరకెక్కించేందుకు ఒక మంచి దర్శకుడును కూడా వెతుకుతున్నాడు. అయితే బడ్జెట్ పరంగా సినిమా చాలా పెద్దదని తెలుస్తోంది. విష్ణు తన సొంత ప్రొడక్షన్ లో దాదాపు రూ.70 కోట్లతో సినిమాను నిర్మించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. భక్త కన్నప్ప జీవిత ఆధారంగా సినిమా కథ నడుస్తుందట. గతంలో కృష్ణంరాజు భక్త కన్నప్ప పాత్రలో కనిపించి కెరీర్ లో మర్చిపోలేని విధంగా గుర్తింపు అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మంచు విష్ణు కూడా భక్త కన్నప్ప పాత్రలో కనిపించి తన బ్రాండ్ ని పెంచుకోవాలని చూస్తున్నాడు. త్వరలోనే ఆ సినిమాకు సంబందించిన పూర్తి వివరాలను విష్ణు తెలియజేయనున్నాడు.