జగన్‌కు ఉన్న జ్ఞానం కేసీఆర్‌కి లేకుండా పోయింది – మాణిక్కం ఠాగూర్

Thursday, April 15th, 2021, 07:44:46 AM IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ నిప్పులు చెరిగారు. ప్రజల మంచి, చెడు చూసే పరిస్థితుల్లో సీఎం కేసీఆర్‌ లేరని, ఆయన కళ్లు తెరవాలంటే సాగర్‌ ఓటర్లు జానారెడ్డిని గెలిపించుకోవాలని అన్నారు. సీఎం ఇంట్లో కూర్చొని అధికారాన్ని అనుభవిస్తూ, రాష్ట్ర బడ్జెట్‌ను దుర్వినియోగం చేసిన డబ్బుతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని అన్నారు. 2023 ఎన్నికల్లో కేసీఆర్‌ కుటుంబ చరిత్ర ఖతమవుతుందని అన్నారు. సాగర్‌ ఉపఎన్నిక తెలంగాణ చరిత్రలో ఓ కీలక మలుపు కాబోతుందని అన్నారు.

అయితే హాలియాలో రెండోసారి నిర్వహిస్తున్న సీఎం సభకు డబ్బు, మద్యం పంపిణీచేసి, వాహనాలు ఏర్పాటుచేసి జనాన్ని తరలించారని రూ.500 తీసుకో, బహిరంగ సభకు వచ్చి కరోనా అంటించుకో అన్నట్లుగా సీఎం ఆలోచన ఉందని అన్నారు. కరోనా కారణంగా సీఎం జగన్‌ సభ రద్దు చేసుకున్నాడని, ఆయనకు ఉన్న జ్ఞానం కూడా కేసీఆర్‌కు లేకుండా పోయిందని అన్నారు. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తున్న సీఎం కేసీఆర్‌పై కేసు నమోదు చేయాలని మాణిక్కం ఠాగూర్ డిమాండ్‌ చేశారు.