కాంగ్రెస్‌కు ఝ‌ల‌కిస్తున్న మ‌ర్రి!

Tuesday, July 2nd, 2019, 10:08:57 AM IST

కాంగ్రెస్ పార్టీని గ‌ల్లీ నుంచి ఢిల్లీ దాకా బీజేపీ వెంటాడుతోంది. ఏ ఒక్క నేత ఆశ‌గా చూసినా ల‌టుక్కున ప‌ట్టేస్తూ త‌న పార్టీలోకి లాగేసుకుంటోంది. గ‌త కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీతో పాటు ఇత‌ర పార్టీల కీల‌క నేత‌ల్ని త‌మ పార్టీలో క‌లుపుకున్న క‌మ‌ల నేత‌లు ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌పై ప్ర‌త్యేక దృష్టిని కేంద్రీక‌రించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్ప‌టికే ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌కు సంబంధించిన కీల‌క నేత‌ల్ని త‌మ పార్టీలోకి లాగేసుకున్న బీజేపీ ఇంకా త‌న ఆక‌ర్ష్ ఆప‌రేష‌న్‌ని ఆప‌డం లేదు. మ‌రింత జోరుగా సాగిస్తూ కాంగ్రెస్, టీడీపీ, తెరాస‌ల‌కు వెన్నులో వ‌ణుకు పుట్టిస్తోంది. తాజాగా టీడీపీ నుంచి కీల‌క నేత‌ల్ని పార్టీలో చేర్చుకున్న బీజేపీ అధినాయ‌క‌త్వం తెలంగాణ‌లో పాగా వేయాల‌ని ప్లాన్ చేస్తోంది.

ఇందులో భాగంగా టీడీపీ నేత‌ల్ని చేర్చుకుని చేరిక‌ల విష‌యంలో ప‌లు పార్టీ నేత‌లకు సంకేతాలు అందించిన అమిత్ షా తాజాగా కాంగ్రెస్ కీల‌క నేత మర్రి చెన్నారెడ్డి త‌న‌యుడు మ‌ర్రి శ‌శిధ‌ర్‌రెడ్డికి రెడ్ కార్పెట్ ప‌రిచిన‌ట్లు తెలుస్తోంది. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో స‌న‌త్‌న‌గ‌ర్ స్థానాన్ని ఆశించి భంగ‌ప‌డ్డారు. అప్ప‌టి నుంచి పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో వున్న ఆయ‌న పార్టీ మారాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చార‌ట‌. బీజేపీలో చేరాల‌ని ఆయ‌న నిర్ణ‌యించుకున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆయ‌న‌తో పాటు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత దామోద‌ర రాజ‌న‌ర‌సింహ స‌తీమ‌ణి ప‌ద్మిని కూడా పార్టీ మారే అవాకాశం వుంద‌ని చెబుతున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆమె బీజేపీలో చేరి గంట‌ల గ‌డ‌వ‌క‌ముందే మ‌ళ్లీ కాంగ్రెస్ గూటికి చేరి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. కానీ ఇప్ప‌డు బీజేపీ తీర్థం పుచ్చుకోవ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నార‌ట‌. 6న అమిత్ షా హైద‌రాబాద్ రాబోతున్నారు. అదే రోజున ఆయ‌న స‌మ‌క్షంలో మ‌ర్రి శ‌శిధ‌ర్‌రెడ్డి, ప‌ద్మినితో పాటు ప‌లువురు నేత‌లు బీజేపీలో చేర‌డానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయిన‌ట్లు తెలిసింది.