అమ్మాయిలకు మార్షల్ ఆర్ట్స్ తప్పనిసరి

Wednesday, October 8th, 2014, 11:22:21 AM IST


ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నానాటికి మహిళలపై జరుగుతున్న అరాచకాలను అరికట్టడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రణాళికను రూపొందించింది. ఇందులో భాగంగా ఆడపిల్లల ఆత్మరక్షణ కోసం 90వేల మంది అమ్మాయిలకు జూడో, కరాటేలలో శిక్షణ ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ మాధ్యమిక విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరిగా విద్యార్ధినులకు జూడో, కరాటే శిక్షణ ఇవ్వాల్సిందిగా మాధ్యమిక విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి మనోజ్ కుమార్ సింగ్ ఆదేశించారు.

అయితే యూపీలో అరాచకాలు మితిమీరిపోవడంతో పాఠశాలల్లో విద్యార్ధినులకు తప్పనిసరిగా ఈ శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కొన్ని నెలల క్రితమే సూచించారు. కాగా 2014-15 విద్యా సంవత్సరం నుండి పాఠ్యాంశాలతో పాటు ఈ శిక్షణను ఒక భాగంగా చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ జూడో సమాఖ్య ప్రధాన కార్యదర్శి మునవ్వర్ అంజార్ ను సలహాదారుగా నియమించినట్లు సమాచారం.