మీడియాలో సైతం తగ్గిన పవన్ హవా !

Sunday, June 9th, 2019, 01:37:03 PM IST

ఎన్నికల ముందువరకు మీడియాకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంచి ఫీడింగ్ పాయింట్ అయ్యారు. అన్ని ఛానెళ్లు ఆయన మీదే ఫోకస్ పెట్టి ప్రోగ్రామ్స్ నిర్వహించాయి. ఆయనతో, ఆయన పార్టీతో సంబంధం లేని వ్యక్తుల్ని సైతం తీసుకొచ్చి డిబేట్స్ నిర్వహించాయి. పనిగట్టుకుని కత్తి మహేష్, శ్రీ రెడ్డిల వివాదాలను పెంచి పెద్దవి చేసి మెరుగైన టీఆర్ఫీ రేటింగ్స్ దక్కించుకున్నాయి టీవీ 9 లాంటి ఛానెళ్లు. బ్రేకింగ్ న్యూస్ లేని ప్రతిసారి పవన్ మీద, జనసేన మీద డిబేట్లు పెట్టి పబ్బం గడుపుకున్నాయి.

కానీ ప్రస్తుతం పరిస్థితి అలా లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మీడియా సైతం జనసేనాని పక్కనబెట్టేసింది. కనీస స్థాయిలో కూడా ఆయనకు కవరేజ్ ఇవ్వడంలేదు. గతంలో చేసిన ప్రతికూల కవరేజ్ కూడా లేదు. దీనికి కారణం ఓడిపోయిన వ్యక్తిని ఎవరు పట్టించుకుంటారు, ఆయన గురించి కవర్ చేసినా జనం చూస్తారా అనే అనుమానాలే. అవసరం ఉన్నంతవరకు ఎడా పెడా వాడేసుకుని ఆ అవసరం తీరాక పక్కనపడేయడం అనే మీడియా తీరుకు ఈ వ్యవహారం స్పష్టమైన సాక్ష్యంగా నిలుస్తుంది. సోషల్ మీడియాలో సైతం జనసైనికులు కొన్నాళ్లుగా స్తబ్దుగానే ఉన్నారు. దీంతో ఎప్పుడూ టాప్ ట్రెండింగ్లో ఉండే పవన్ ఊసే సోషల్ మీడియాలో కనబడటంలేదు.