మంత్రి ఈటలకు షాక్.. సీఎం కేసీఆర్‌కు వైద్యారోగ్య శాఖ బదిలీ..!

Saturday, May 1st, 2021, 05:02:46 PM IST

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌పై వచ్చిన భూ కబ్జాల ఆరోపణల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈటల నిర్వహిస్తున్న వైద్యారోగ్య శాఖను సీఎం కేసీఆర్‌కు బదిలీ చేశారు. తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈటలపై భూ కబ్జా ఆరోపణలు రావడంతో వైద్యఆరోగ్యశాఖ నుంచి ఆయనను తప్పించాలని సీఎం కేసీఆర్ గవర్నర్‌కు సిఫారసు చేశారు. అంతేకాదు ఆ శాఖను తనకు కేటాయించాలని ప్రతిపాదించారు. సీఎం కేసీఆర్ ప్రతిపాదనకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కూడా ఆమోదముద్రవేశారు. దీంతో ప్రస్తుతం మంత్రి ఈటల వద్ద ఏ శాఖ లేదు. త్వరలోనే ఆయనను మంత్రివర్గం నుంచి కూడా బర్తరఫ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే తన శాఖ తొలగింపుపై స్పందించిన మంత్రి ఈటల సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఏ శాఖనైనా ఎవరినుంచైనా, ఎప్పుడైనా తీసుకునే అధికారం సీఎంకు ఉంటుందని, ప్రజలకు మెరుగైనా వైద్యం అందాలని కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చాడు. ప్రణాళిక ప్రకారమే తనపై కుట్ర జరిగిందని, శాఖ ఉన్నా లేకున్నా ప్రజలకు సేవ చేస్తానని అన్నారు. త్వరలోనే నియోజకవర్గ ప్రజలతో సమావేశమై కార్యచరణను ప్రకటిస్తానని, ఇకపై సీఎం కేసీఆర్‌తో మాట్లాడే ప్రసక్తే లేదని ఈటల తేల్చి చెప్పారు.