సైరా రూమర్స్ కి మెగాస్టార్ చెక్ !

Saturday, January 20th, 2018, 11:48:21 AM IST

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151 వ చిత్రం సైరా పై రోజుకో రకమైన రూమర్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దీనికితోడు మొదటి షెడ్యూల్ లో సురేందర్ రెడ్డి తీసిన సన్నివేశాలు కొన్ని మెగాస్టార్ కి సంతృప్తికరం గా అనిపించలేదని, అందుకే పాటలు చిత్రీకరణ కోసం క్రియేటివ్ దర్శకులు కృష్ణవంశీని, అలాగే యాక్షన్ సీన్స్ కోసం దర్శకులు గుణశేఖర్ ని సంప్రదించినట్లు పుకార్లు షికార్లు చేశాయి. నిజానికి గుణశేఖర్ తనకు ఆ విషయమై ఫోన్ సమాచారం కూడాలేదని, అలానే కృష్ణవంశీ నక్షత్రం తరువాతి చిత్ర పనుల్లో బిజీగా ఉండి బయట ఎక్కడ కనిపించడం లేదని తేలడంతో ఈ వార్తలు వొట్టి పుకార్లేనని తేలిపోయాయంటున్నారు. అయితే ఈ చిత్రం ముహూర్త బలం బాగోకపోవడమో లేక మరేదైనా కారణమో తెలియదు కానీ, మొదట కెమరామెన్ రవివర్మన్ ని తీసుకోవడం, తర్వాత అనివార్య కారణాల వల్ల ఆయన స్థానం లోకి రత్నవేలు రావడం జరిగింది. చిరంజీవి ఖైదీ నెంబర్ 150 కి కూడా ఆయనే కెమరామెన్ గా పని చేశారు. అలానే మ్యూజిక్ఆ డైరెక్టర్ గా మొదట ఏ ఆర్ రహమాన్ ని అనుకున్నారు కానీ, ఆమధ్య హైదరాబాద్ లో లైవ్ కాన్సర్ట్ ఇవ్వడానికి వచ్చిన ఏ ఆర్ రహమాన్ కూడా తాను సైరా ప్రోజెక్ట్ చేయలేపోతున్నట్లు స్వయంగా మీడియాకి చెప్పారు. దానితో ఈ పుకార్లకు మరింత ఊతం ఇచ్చినట్లయింది. ఒకానొక సమయంలో మాటల రచయిత బుర్రసాయి మాధవ్కు , పరుచూరి సోదరులకు మధ్య ఏవో అభిప్రాయబేధాలు వచ్చినట్లు, దాని కారణంగా ఆయన కూడా తప్పుకోవాలనుకుంటున్నట్లు, అలానే హీరోయిన్ నయనతార కూడా తన పాత్ర పై సుముఖంగా లేరని, ఇలా చాలా వరకు పుకార్లు షికారు చేశాయి. అవి చివరకు చిరంజీవి వద్దకు చేరడంతో, ఇప్పుడు స్వయంగా మెగాస్టార్ రంగంలోకి దిగి వీటికి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించారట. ఇలాంటి రూమర్ల వల్ల యూనిట్ లో తప్పుడు సంకేతాలు వెళతాయని భావించి ప్రతి ఒక్కరికి వ్యక్తిగత ఎస్ఎమ్ఎస్ లు చేశారట. ఒక పెద్ద ప్రోజక్ట్ చేస్తున్నపుడు ఇలాంటివి రావడం సహజమని యూనిట్ సభ్యుల్లో ఆత్మస్థైర్యం నింపారట.అటు యూనిట్ సభ్యులకు, ఇటు సాధారణ ప్రజలకు ఈ ప్రాజక్ట్ పై ఇప్పటివరకు వున్న అయోమయాలకు,రూమర్లకు చెక్ పడినట్లయిందని సినీవర్గాలు చెప్తున్నాయి…