‘సైరా’ రికార్డుల యుద్ధం షురూ..తొలి బాంబు పడింది..!

Sunday, October 22nd, 2017, 11:00:30 PM IST

మెగాస్టార్ చిరంజీవి 151 వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ ఆ మధ్యన పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాకముందే రికార్డుల వేటని మెగాస్టార్ ప్రారంభించేశారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథగా ఈ చిత్రం రాబోతోంది. తమిళనటుడు విజయ్ సేతుపతి, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ వంటి భారీ తారాగణంతో ఈ చిత్రం అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. మెగాస్టార్ చిరంజీవి మునుపెన్నడూ ఈ తరహా పాత్రలో నటించకపోవడం కూడా భారీ అంచనాలకు కారణం అయింది.

అన్ని చిత్రాల డిజిటల్ హక్కులని సొంతం చేసుకోవడంలో ముందుంటున్న అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ సైరాపై కన్నేసింది. జాతీయ స్థాయిలో ఈ చిత్రానికి పెరుగుతున్న పాపులారిటీని క్యాష్ చేసుకునే పనిలో ఆ సంస్థ పడింది. సైరా డిజిటల్ హక్కులకు గాను నిర్మాత రామ్ చరణ్ కు అమెజాన్ అదిరిపోయే ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది. కేవలం సినిమా మాత్రమే కాక ట్రైలర్, టీజర్ మరియు మేకింగ్ వీడియోలతో సహా డిజిటల్ హక్కులని సొంతం చేసుకునేందుకు అమెజాన్ చరణ్ కు రికార్డ్ ప్రైజ్ తో డీల్ ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తుంది. ఈ డీల్ కనుక ఓకె అయితే చిత్ర బడ్జెట్ లో 20 శాతం కవర్ అయినట్లే అని అంచనా వేస్తున్నారు. చెర్రీ ఈ డీల్ ని ఓకె చేస్తాడా లేక ఇంకా మంచి డీల్ వచ్చేవరకు వేచి చూస్తాడా అనేది తెలియాల్సి ఉంది.