పెరుగుతున్న మద్యం బాబుల ఆగడాలు – ఎర్రగడ్డ ఆసుపత్రిలో పెరుగుతున్న కేసులు

Wednesday, April 1st, 2020, 11:56:51 AM IST

ప్రజల ప్రాణాలను అవలీలగా హరించే భయంకరమైన కరోనా వైరస్ ని అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మూకుమ్మడిగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ని అమలు చేశాయి. అయితే ఈ లక్డౌన్ వలన కొంతమేరకైన కరోనాని అడ్డుకున్నప్పటికీ కూడా, ఈ లాక్ డౌన్ కొందరు ప్రజల్లో మిశ్రమ ఫలితాలను చూపిస్తున్నాయి. కాగా ఈ లాక్ డౌన్ వలన గత కొంత కాలంగా మద్యం సరఫరాలు కూడా జరగడం లేదు. ‌ఈ కారణంగా మద్యం అందుబాటులో లేకపోవడం వలన మద్యానికి బానిసైన వారి పరిస్థితి రోజురోజుకూ దుర్భరంగా మారుతుంది. ఇలా జరగడం వలన మద్యానికి బానిసైన వారు మతిస్థిమితాన్ని కోల్పోతున్నారు. ఈ క్రమంలో వారందరిని చికిత్స నిమిత్తం ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలకు తరలిస్తున్నారు. .

ఈ లెక్క ప్రకారం చూసుకుంటే… మంగళవారం నాడు ఎర్రగడ్డ ప్రభుత్వ మానసిక వైద్యశాలకు 198 మంది ఔట్‌ పేషెంట్లు హాజరైనట్టు సూపరింటెండెంట్‌ ఉమాశంకర్‌ ఒక ద్వారా వెల్లడించారు. అయితే వారిలో 198 మంది ఓపీకి రాగా 101 మందికి వైద్యం చేసి,పంపించేశామని, మిగతా 97 మందిని ఎమర్జెన్సీగా గుర్తించి ఆస్పత్రిలోనే ఉంచి అవసరమైన వైద్య సేవలను అందిస్తున్నామని వెల్లడించారు. అయితే మద్యానికి బానిసైనవారికి మద్యం దొరకని కారణంగానే ఇలా పిచ్చివారిలా మారిపోతున్నారని, వారికి సకాలంలో చికిత్స అందిస్తే త్వరగానే కోలుకుంటున్నారని వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు.