సీఎం కేసీఆర్ ని కలుసుకున్న ఎంఐఎం నేత…?

Sunday, February 9th, 2020, 09:02:33 PM IST

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఆదివారం నాడు ఎంఐఎం నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ కలిశారు. ఈ భేటీలో భాగంగా పలు కీలకమైన అంశాలపై చర్చలు జరిగినట్లు సమాచారం. కాగా పాతబస్తీ లాల్‌ దర్వాజ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే అక్బరుద్దీన్, సీఎం కేసీఆర్ కి వినతి పత్రమిచ్చారు. అంతేకాకుండా ప్రతీ సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నటువంటి బోనాలు పండగ కి ఎంతగానో ప్రాధాన్యత ఉందని, ఆ బోనాల పండగ దేశవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుందని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వెల్లడించారు. అలాంటి పండగ సమయంలో సరైన స్థలం లేక భక్తులందరూ కూడా ఎంతగానే అవస్థ పడుతున్న విషయాన్నీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సీఎం కేసీఆర్ కి వెల్లడించారు.

అయితే ఆ దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి నిధులు సమకూర్చాలని, అంతేకాకుండా రూ.10 కోట్లతో దేవాలయాన్ని విస్తరించాలని ఎమ్మెల్యే కోరారు. దానికి తోడు అఫ్జల్‌గంజ్‌ మసీద్‌ మరమ్మతుల కోసం రూ.3 కోట్లు నిదులని అందించాలని సీఎం కేసీఆర్ ని ఒవైసీ కోరుకున్నారు. అయితే ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చెప్పిన ప్రపోసల్ కి మెచ్చిన సీఎం కేసీఆర్ ఆ రెండు ఆలయాల అభివృద్ధికై తక్షణమే నిదులని సమకూరుస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.