షెడ్యూల్ ప్రకారమే ఇంటర్ పరీక్షలు.. మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ..!

Wednesday, April 28th, 2021, 11:00:07 PM IST

adimulapu-suresh

ఏపీలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రతిపక్ష పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం మాత్రం పరీక్షలను నిర్వహించేందుకే సుముఖత చూపుతుంది. అయితే తాజాగా ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మే 5 నుంచి షెడ్యూల్ ప్రకారమే ఇంటర్ పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు. అన్ని జిల్లాల్లో అధికారులు కోవిడ్‌ జాగ్రత్తలతో పరీక్షల నిర్వహణకు సిద్ధం కావాలని సూచించారు.

అయితే ఇంటర్మీడియట్ పరీక్షలు అనివార్యమని గుర్తించాలని, ఏ రాష్ట్రంలోనూ పరీక్షలు రద్దు కాలేదని అన్నారు. కొన్నిచోట్ల పరీక్షలు నిర్వహిస్తుంటే, మరికొన్ని చోట్ల వాయిదా వేశారని గుర్తు చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు దీనిని అనవసరంగా రాద్ధాంతం చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రుల మానసిక ధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. వైద్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధవంతంగా అమలు చేసేందుకు అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని అన్నారు.