సంయమనం పాటించండి.. అభిమానులకు మంత్రి ఈటల విజ్ఞప్తి..!

Saturday, May 1st, 2021, 10:10:33 AM IST

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌పై వచ్చిన భూ కబ్జాల ఆరోపణల అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాఫిక్‌గా మారింది. దీనిపై సీఎం కేసీఆర్ విచారణకు సైతం ఆదేశించారు. దీనిపై నిన్న మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన మంత్రి ఈటల రాజేందర్ పక్కా ప్రణాళిక ప్రకారమే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, భూ కబ్జా ఆరోపణలు కేవలం కట్టుకథలు మాత్రమేనని వ్యాఖ్యానించారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలపై సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించారని సీఎస్, విజిలెన్స్ డీజీతోనే కాకుండా సిట్టింగ్ జడ్జితో కూడా విచారణ జరిపించుకోవచ్చని పరోక్షంగా సవాల్ విసిరారు.

అయితే ఈటల వంటి ఉద్యమ నాయకుడిపై ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో ఆయన మద్ధతుదారులు భారీగా హైదరాబాద్‌కు వస్తూ ఆయనను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి ఈటల తన అభిమానులకు ఓ విన్నపం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గం ప్రజలు, కార్యకర్తలు, నాయకులు సంయమనం పాటించాలని, కరోనా సమయం కాబట్టి ఎవరూ కూడా హైదరాబాద్‌కు రావొద్దు. ఇబ్బందులు పడవద్దు అని విజ్ఞప్తి చేశారు.