తెలంగాణలో లాక్డౌన్, కర్ఫ్యూలాంటివి పెట్టే ప్రసక్తే లేదని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఈటల రాపిడ్ టెస్ట్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత ట్రేసింగ్ వేగవంతం అయ్యిందని ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 56 వేల మందికి వాక్సిన్ ఇస్తున్నామని, ముందు ముందు లక్ష మందికి పైగా వ్యాక్సిన్ వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పుకొచ్చారు.
అయిఏ లక్షణాలు లేకుండా చాలా కరోనా కేసులు నమోదవుతున్నాయని ప్రజలు మాస్క్, భౌతిక దూరం నిబంధనలు పాటించాలని కోరారు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం మరికొన్ని రోజులు ఉంటుందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో కోవిడ్, నాన్ కోవిడ్ సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. మొత్తం 33 జిల్లాల్లో ఐసొలేషన్ సెంటర్లు ఏర్పాటు చేశామని అన్నారు. అయితే రాష్ట్రంలో లాక్ డౌన్, కర్ఫ్యూలు ఉండవని, పబ్, క్లబ్బులో కరోనా జాగ్రత్తలు పాటించాలని ఈటల సూచించారు.