భూకబ్జా ఆరోపణలు కట్టుకథలు.. ప్రభుత్వానికి మంత్రి ఈటల సవాల్..!

Saturday, May 1st, 2021, 12:00:00 AM IST

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌పై వచ్చిన భూ కబ్జాల ఆరోపణల అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాఫిక్‌గా మారింది. దీనిపై సీఎం కేసీఆర్ విచారణకు సైతం ఆదేశించారు. ఈ పరిణామాలా నేపధ్యంలో మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన మంత్రి ఈటల రాజేందర్ తనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలు కేవలం కట్టుకథలు మాత్రమేనని అన్నారు. పక్కా ప్రణాళిక ప్రకారమే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. 2016లో జమున హెచరీస్ కోసం ఎకరం రూ.6 లక్షల పెట్టి 40.50 ఎకరాల భూమిని ఒకేసారి కొన్నామని, అందుకోసం కెనరా బ్యాంకు నుంచి రూ.100 కోట్లు రుణంగా తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు.

అయితే తాను కొన్న భూముల చుట్టూ అసైండ్ భూములు ఉన్న మాట వాస్తవమేనని, అయితే రైతులే ఆ భూములను ప్రభుత్వానికి సరండర్ చేస్తూ లేఖలు ఇచ్చారని ఈటల అన్నారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలపై సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించారని అయితే సీఎస్, విజిలెన్స్ డీజీతోనే కాకుండా సిట్టింగ్ జడ్జితో కూడా విచారణ జరిపించాలని ప్రభుత్వానికి మంత్రి ఈటల సవాల్ విసిరారు. త‌న‌కు ఆత్మ‌గౌర‌వం కంటే ప‌ద‌వి గొప్ప‌కాదని, తాని నిప్పునని ఎక్కడైనా తప్పు చేసినట్టు తేలితే శిక్షకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. తాను ఎలాంటి వ్యక్తిని అనేది 20 ఏళ్లుగా ప్రజలకు తెలుసనని ఇలాంటి వాటికి లొంగే ప్రసక్తే లేదని ఈటల చెప్పుకొచ్చారు.