మీరే చెప్పండి ఎక్కడికి పోదాం.. బీజేపీ, కాంగ్రెస్ నేతలకు మంత్రి కేటీఆర్ సవాల్..!

Saturday, April 3rd, 2021, 08:32:21 PM IST

తెలంగాణ మంత్రి కేటీఆర్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై మరోసారి మండిపడ్డారు. నేడు రాజన్న సిరిసిల్ల జిల్లా మోహినికుంట గ్రామంలో డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్లను ప్రారంభించిన కేట్టీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ తరహాలో ఏ పార్టీ అభివృద్ధి చేసిందో చూపించాలని ఛాలెంజ్ చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు పోదామా? బీజేపీ పాలిత రాష్ట్రాలకు పోదామా? మీరే చెప్పాలని, తెలంగాణ పల్లెల్లో ఉన్న తరహాలో అభివృద్ధి చూపిస్తారా అని ప్రశ్నించారు.

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి కేసీఆర్ సీఎం అయిన తర్వాత గ్రామపంచాయతీల పాలనను గాడిలోపెట్టారని, ప్రతి గ్రామంలో ఓ వైకుంఠదామం, నర్సరీ, డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనం, చెట్లు ఉన్నాయని ఇదంతా సీఎం కేసీఆర్ కృషి అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అవార్డులు మాత్రమే ఇస్తుంది కానీ, నిధులు మాత్రం ఇవ్వడంలేదని, నీతి ఆయోగ్ చెప్పినా కేంద్రం నుంచి రాష్ట్రానికి పైసా రాలేదని కేటీఆర్ మండిపడ్డారు. కొందరు సోషల్ మీడియా వేదికగా పిచ్చి వేషాలు వేస్తుంటే, మరికొందరు మీడియా ముందు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆరోపించారు. బీజేపీ నేతలకు మెదడు మోకాళ్లలో ఉందని అన్నారు. మాకు నిధులు ఇవ్వకున్నా పర్లేదు కానీ, మా దగ్గరకు వచ్చి గొప్పలు చెప్పకండని కేటీఅర్ సూచించారు.