గ్రేటర్ ఎన్నికల్లో ఆశించిన ఫలితం రాలేదని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్కు ఇంకో 25-30 డివిజన్లు ఇంకా అదనంగా వస్తాయని ఆశించామని, కొన్ని డివిజన్లలో స్వల్ఫ ఓట్ల తేడాతో ఓడిపోయామని చెప్పుకొచ్చారు. అయినా కూడా గ్రేటర్లో అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్ను ప్రజలు ఆదరించారని వెల్లడించారు.
దీనిపై టీఆర్ఎస్ శ్రేణులు నిరాశ పడాల్సిన పనిలేదని, ఫలితాలపై సమీక్ష నిర్వహించుకుంటామని అన్నారు. టీఆర్ఎస్కు ఓటు వేసిన ప్రజలకు, అలాగే టీఆర్ఎస్ కార్యకర్తలకు, నేతలకు అభినందనలు తెలియచేశాడు. అటు మేయర్ పీఠంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఇదిలా ఉంటే గత కొద్ది రోజుల నుంచి గ్రేటర్ ఎన్నికల అనంతరం కేటీఆర్‌ను సీఎం చేస్తున్నారని తెగ ప్రచారం జరుగుతుంది. అయితే గ్రేటర్ ఫలితాలు టీఆర్ఎస్కు పూర్తి భిన్నంగా రావడంతో ఇప్పట్లో కేటీఆర్‌ను సీఎం చేసేందుకు కేసీఆర్ సాహసించబోరేమోనని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే అదే కనుక నిజమైతే కేటీఆర్ సీఎం పీఠంపై పెట్టుకున్న ఆశలు ఆవిరైనట్టే.