ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజల మధ్య సఖ్యత, సోదరభావం ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయడంలో రాజకీయం ఏముందో నిమ్మగడ్డ సమాధానం చెప్పాలని మంత్రి పెద్దిరెడ్డి ప్రశ్నించారు. పంచాయితీ ఎన్నికల్లో ఏకగ్రీవం అయ్యే వాటికి నజరానా ప్రకటించడం దశాబ్దాలుగా కొనసాగుతుందని ఆ ప్రక్రియను తప్పుబట్టదలచుకుంటే టీడీపీ హయాంలో ఎందుకు తప్పుబట్టలేదని, అప్పటికే ఉన్న జీవో మీద కోర్టుకు ఎందుకు వెళ్లలేదో నిమ్మగడ్డ చెప్పాలని అన్నారు.
అయితే చంద్రబాబు చేతిలో నిమ్మగడ్డ రమేశ్ కీలు బొమ్మలా మారరని ఎద్దేవా చేశారు. ఏకగ్రీవాలపై అటు చంద్రబాబు, ఇటు నిమ్మగడ్డ ఒకే రకమైన అభిప్రాయాలను వ్యక్తం చేయడం వెనుక అనుమానాలు ఉన్నట్టు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. నామినేషన్లు వేయకముందే నిమ్మగడ్డ ఎందుకు ప్రెస్మీట్లో ఏకగ్రీవాల మీద మాట్లాడారని, అసలు ఏకగ్రీవాలు ఎన్ని అవుతాయో ముందుగానే నిమ్మగడ్డ ఎందుకు ఊహించి కంగారుపడుతున్నారని ప్రశ్నించారు.