లోకేష్ స్థానాన్ని వద్దన్న ఏపీ మంత్రి – కారణం ఏంటంటే…?

Wednesday, June 12th, 2019, 08:43:30 PM IST

ఏపీకి కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికైనటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసుకున్న తన మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న కొత్త మంత్రులు తమ తమ బాధ్యతలను స్వీకరిస్తున్నారు. కాగా ఈ కొత్తగా ఎన్నికలయిన మంత్రులు తమకు కేటాయించిన చాంబర్ల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వారిలో ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకరు. కాగా కొత్తగా ఎన్నికైనటువంటి జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో పంచాయితీ రాజ్, మైనింగ్ శాఖలను దక్కించుకున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి గత ప్రభుత్వ మంత్రివర్గంలోలాగే సచివాలయంలోగల 5వ బ్లాక్ లోని ఛాంబర్ ని కేటాయించారు. అయితే ఈ ఛాంబర్ ని తిరస్కరించి, మరొక ఛాంబర్ ని తీసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్ణయించుకున్నారు.

ఈమేరకు సచివాలయంలోని 3వ బ్లాక్ లో 203వ రూమ్ ని తన ఛాంబర్ గా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. అందులోభాగంగా గురువారం నాడు ఆయన తన కొత్త ఛాంబర్ లో మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా గత ప్రభుత్వంలోని మంత్రి లోకేష్ కి కేటాయించిన ఛాంబర్ ని, కొత్త మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరస్కరించడం వెనకాల కారణం ఏంటి అని ఇప్పటికే పలు చర్చలు జరుగుతున్నాయి.. ఇదివరకు లోకేష్ వాడుకున్నటువంటి ఛాంబర్ ఎన్ని రకాల సదుపాయాలతో, అత్యాధునికంగా, ఎంతో విశాలంగా ఉన్నపటికీ కూడా, పెద్దిరెడ్డి ఎందుకు ఈ ఛాంబర్ ని వదులుకున్నారని ఆరా తీయగా, ఆ ఛాంబర్ కి వాస్తు సరిగా లేదని, ఇంత అకస్మాత్తుగా ఆ ఛాంబర్ కి మార్పులు చేయించడం కంటే వేరే ఛాంబర్ ని తీసుకోవడం మంచిదనే ఉద్దేశంతోనే ఆలా చేశానని, అంతేతప్ప మరేఇతర కారణాలు లేవని చెప్పుకొచ్చారు.