కరోనా కట్టడికి లాక్‌డౌన్ పరిష్కారం కాదు.. మంత్రి సబిత కీలక వ్యాఖ్యలు..!

Wednesday, July 1st, 2020, 02:16:01 AM IST

తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ లాక్‌డౌన్ విధించాలన్న యోచనలో ఉంది. అయితే రాష్ట్రంలో నమోదయ్యే మొత్తం కేసుల్లో 70 శాత జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉండడంతో హైదరాబాద్‌లో మాత్రమే లాక్‌డౌన్ విధించాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే జూలై 2న తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో దీనిపై ఓ నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది.

అయితే మరోసారి హైదరాబాద్‌లో లాక్‌డౌన్ విధించబోతున్నారన్న అంశంపై స్పందించిన తెలంగాణ విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా కట్టడికి లాక్‌డౌన్ అమలు పరిష్కారం కాదని, మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తే పేద, మధ్య తరగతి కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదురుకోవాల్సి వస్తుందని అన్నారు. అయితే ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలు పాటిస్తూ, జాగ్రత్తలు తీసుకుంటూ కరోనాను కట్టడి చేయడం ఒక్కటే మార్గమని అన్నారు.