హచ్ నెట్‌వర్క్‌ మాదిరి తిరుగుతున్న పవన్ కళ్యాణ్ – ఆగ్రహించిన మంత్రి అనిల్

Tuesday, December 3rd, 2019, 05:58:12 PM IST

తాడేపల్లి లోని రాష్ట్ర అధికార వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశానికి హాజరైనటువంటి ఆంధ్రప్రదేశ్ సాగునీటి శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ… జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ కుల,మతాలను, ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టే వాఖ్యలు చేస్తున్నారని, ప్రజలందరినీ తప్పు దోవ పట్టిస్తున్నారని మంత్రి అనిల్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పవన్ పై కొన్ని కించపరిచే వాఖ్యలు కూడా చేశారు. పవన్ కళ్యాన్ రాష్ట్రంలో అటు రాజకీయ నాయకుడిగా, ఇటు సినీ నటుడిగా రెండు రకాలుగా ఓడిపోయారని, అటు సినిమాలు లేక, ఇటు రాజకీయాల్లో సరిగా రాణించలేక పిచ్చిపట్టినట్లు, ఇష్టారీతిలో మాట్లాడుతున్నారని మంత్రి అనిల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే అప్పట్లో ‘వేర్‌ యూ గో… ఐ విల్‌ ఫాలో…’ అని హచ్‌ మొబైల్‌ నెట్‌వర్క్‌కు సంబంధించి ఒక యాడ్ వచ్చేదని, ఆ యాడ్ లో మాదిరి చంద్రబాబు చుట్టూ కుక్కపిల్లలా తిరిగాడని, ఇప్పుడు కూడా బయటకు విమర్శిస్తున్నట్లు నటిస్తూ, లోలోపల చంద్రబాబుని అనుసరిస్తున్నారని మంత్రి అనిల్ ఆరోపించారు. ఇకపోతే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకున్నప్పటినుండి ప్రజలందరి కోసం చేస్తున్నటువంటి మంచిని చూసి ఓర్వలేక సీఎం జగన్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి అనిల్, జనసేన అధినేత పవన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపోతే నోరు ఉంది కదా అని ఏదంటే అది సంస్కారహీనంగా మాట్లాడొద్దని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హెచ్చరించారు.