అనాధ శవానికి అంతిమ సంస్కారాలు.. మానవత్వం చాటుకున్న తెలంగాణ మంత్రి..!

Friday, March 27th, 2020, 03:00:06 AM IST

తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ అనాధ వృద్ధురాలి మృతదేహానికి దగ్గరుండి మరీ అంతిమ సంస్కారాలు జరిపించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో గత కొన్ని సంవత్సరాలుగా యాచకురాలుగా జీవనం సాగిస్తున్న యాదమ్మ అనే వృద్ధురాలు నేడు అనారోగ్యంతో చనిపోయారు.

అయితే అధికారులు ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్ళగా హుటాహుటిన అక్కడికి వెళ్లి మంత్రి శ్రీనివాస్ గౌడ్ మృతి చెందిన వృద్ధురాలి వివరాలు తెలుసుకున్నాడు. అయితే ఆమెకు మానసిక వికలాంగుడైన ఒక కుమారుడు కూడా ఉన్నట్టు, వారిద్దరు కలిసి భిక్షాటనతో జీవనం సాగిస్తూ, రాత్రి కాగానే తెలంగాణ చౌరస్తా ప్రాంతంలో నిద్రిస్తారని మున్సిపల్ అధికారులు మంత్రిగారికి చెప్పారు. వృద్ధురాలి వివరాలు తెలుసుకుని చలించిపోయిన మంత్రి శ్రీనివాస్ మున్సిపల్ అధికారులతో ఆమె అంత్యక్రియలకు ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు. అంతేకాదు స్వయంగా ఆ అనాథ శవాన్ని అంబులెన్స్ లోకి తీసుకెళ్లి అంత్యక్రియలకు పంపారు.