టీఆర్ఎస్‌కు ఓటెయ్యకుంటే బాగుపడరు.. శాపనార్థాలు పెట్టిన మంత్రి శ్రీనివాస్ గౌడ్..!

Saturday, March 6th, 2021, 08:23:16 AM IST

టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటెయ్యకుంటే బాగుపడరంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ శాపనార్ధాలు పెట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా బాదేపల్లిలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొంది, తమ పార్టీకి ఓటెయ్యని దుర్మార్గులను భగవంతుడు క్షమించడని, వాళ్ల ఇండ్లు నాశనమైపోతాయని అన్నారు.

అంతేకాదు కల్యాణలక్ష్మి, రైతు బీమా, పెన్షనన్లు ఇలా అర్హులకు అన్ని పథకాలు అందిస్తున్నామని అన్నారు. కర్నాటకలో కరెంట్ ఇయ్యక, పెన్షన్ ఇయ్యక, రైతుబంధు, బీమా ఇయ్యక, సస్తే, బతికితే సీఎం రిలీఫ్ ఫండ్ ఇయ్యక ఆ రాష్ట్రాన్ని నాశనం చేసి వచ్చిన వాళ్లకు ఇక్కడ ఎట్ల సపోర్ట్ చేస్తం అని పరోక్షంగా బీజేపీపై మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి చేరాలన్నదే తమ లక్ష్యమని దీనిని ప్రజలు గుర్తుపెట్టుకోవాలని అలా కాకుండా ఇతర పార్టీలకు ఓటు వేస్తే మిమ్మల్ని మీరే మోసం చేసుకున్న వారవుతారని అన్నారు.