అసెంబ్లీలో బాబుపై నిప్పులు చెరిగిన రోజా ..

Thursday, June 13th, 2019, 11:40:27 PM IST

వైస్సార్సీపీ ఫైర్ బ్రాండ్ నగరి MLA రోజా మరో అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. స్పీకర్ ఎన్నికని బలపరిచి, అభినందనలు తెలిపే క్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఒకరిని మించి మరొకరు,ఒకరి గురించి మరొకరు మాటల తూటాలు పేల్చుకుంటున్న సమయంలో వైస్సార్సీపీ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ స్పీకర్ ని తీసుకోని వెళ్ళటానికి చంద్రబాబు రాకుండా ఆయన బంట్రోతుని పంపాడు అంటూ మాట్లాడాడు.

దానికి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ భాస్కర్ రెడ్డి క్షమాపణ చెప్పాలని టీడీపీ వాళ్ళు డిమాండ్ చేశారు. ఈ సమయంలో రోజా మాట్లాడుతూ అసలు స్పీకర్ స్థానాన్ని గౌరవించే పద్దతి చంద్రబాబు గారికి ఎప్పుడు లేదని, అప్పట్లో కిరణ్ కుమార్ స్పీకర్ గా చేస్తున్న సమయంలో కూడా ఆయనని అవమానించారు. అయినా మా సభ్యుడు అన్నమాటకి ఒక్కసారి క్షమాపణ చెప్పాలంటే మరి మీరు, మీ సభ్యులు గత ఐదేళ్లల్లో అసెంబ్లీ లో మాట్లాడిన మాటలకి ఎన్నిసార్లు క్షమాపణ చెప్పాలి. ఒక్క క్షమాపణ మాత్రమే కాదు, లెంపలేసుకొని,గుంజీలు తీసిన తక్కువే అవుతుంది.

అయినా సభా మర్యాదల గురించి మీ దగ్గర నేర్చుకోవలసిన అవసరం మాకు లేదు. అప్పట్లో” కాల్ మనీ,సెక్స్ రాకెట్” గురించి మాట్లాడుతుంటే నా మైక్ కట్ చేసి, నన్ను అన్యాయంగా బయటకు పంపించింది మీరు. ఇప్పుడు, ఈ రోజు సభా మర్యాదల గురించి మీరు మాట్లాడుతున్నారు. మీరు అలా మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందని రోజా ఘాటు విమర్శలు చేసింది..