లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారు.. చంద్రబాబుపై హైకోర్ట్‌కు ఫిర్యాదు..!

Tuesday, May 26th, 2020, 03:00:18 AM IST

లాక్‌డౌన్ కారణంగా దాదాపు రెండు నెలల తర్వాత ఏపీలో అడుగుపెట్టిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని ఎమ్మెల్సీ వి.గోపాల్ రెడ్డి హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. మార్చి 22న హైదరాబాద్ వెళ్ళిన చంద్రబాబు ఆ తర్వాత దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ప్రన్తుతం లాక్‌డౌన్ 4లో కొన్ని సడలింపులు ఉండడంతో ఇరు రాష్ట్రాల డీజీపీలతో అనుమతి తీసుకున్న చంద్రబాబు నిన్న ఏపీకి చేరుకున్నారు.

అయితే చంద్రబాబు నాయుడు కాన్వాయ్ తెలంగాణ-ఆంధ్రా సరిహద్దు దాటిన తర్వాత టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగత కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. గరికపాడు, నందిగామ, కంచికచర్ల, ఇబ్రహీంపట్నం,గొల్లపూడి, విజయవాడ ప్రాంతంలో చంద్రబాబు ఆగారని, ఆయనకు స్వాగతం పలికేందుకు వందలాది మంది వచ్చారని, చాలా మంది కనీసం మాస్క్ కూడా ధరించలేదని వి.గోపాల్ రెడ్డి ఆరోపించారు. మాజీ సీఎం, ప్రతిపక్ష నేతగా ఉండి ఏమాత్రం బాధ్యత లేకుండా లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని చంద్రబాబుపై హైకోర్టుకు ఫిర్యాదు చేశారు.